బాధిత బతుకు నుంచే పోరాటం మొదలవుతుంది. ఆ పోరాటాన్ని అణచి వేయాలని చూసినప్పుడు విప్లవం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో అభ్యుదయమే కాదు… అంతకు మించిన భావోద్వేగాలూ ఉంటాయి. అలాంటి ఓ భావోద్వేగ ప్రయాణమే.. విరాటపర్వం. రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సాయి పల్లవి కథానాయిక. వేణు ఉడుగుల దర్శకుడు. ఏప్రిల్ 30న విడుదల అవుతోంది. ఈరోజు టీజర్ వచ్చింది.
నక్సల్ ఉద్యమ నేపథ్యంలో సాగే కథ ఇది. టీజర్లోని ప్రతీ అడుగూ.. ఆ బాటనే చూపిస్తోంది. ఓ అభ్యుదయ వాది. తన కవిత్వాన్ని ప్రేమించే ఓ అమ్మాయి. వీరిద్దరి మధ్య సాగే ప్రయణమే ఈ కథ. అభ్యుదయానికీ, ప్రణయానికీ ఎలా లింకు కుదిరిందో చూడాలి. ఈ కథలో… సున్నితమైన అంశాలతో పాటు.. గుండె జలదరించే విషయాలూ చూపించబోతున్నారన్న విషయాన్ని టీజర్ చెప్పకనే చెప్పేసింది. ఓ భావోద్వేగ భరితమైన కవితతో ఈ టీజర్ మొదలెడితే, అరణ్యపై అంతులేని ప్రేమ పెంచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపించింది. బుల్లెట్ చప్పుళ్లూ, అరణ్య రోదనలూ.. వాటి మధ్య ఓ ప్రేమకథ. ఇదీ అరణ్య. ప్రియమణి, నందితాదాస్, సాయి పల్లవి.. ఇలా స్త్రీ పాత్రల్ని ఉదాత్తంగా చూపించామని చిత్రబృందం చెబుతోంది.చూస్తోంటే.. రానా కంటే.. సాయి పల్లవి డామినేషనే ఎక్కువ కనిపిస్తోంది. మొత్తానికి స్ఫూర్తివంతమైన ఓ కథని చూడబోతున్నామన్న సంకేతాల్ని ఈ టీజర్ పంపేసింది.