భారతీయ క్రికెట్ లో లెజెండ్ అనదగ్గ అతి కొందరిలో ఒకడైన వీరేంద్ర సెహ్వాగ్ రిటైరయ్యాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. దీంతో, మన దేశ క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. ఒక అద్భుతమైన ఆటగాడి మెస్మరైజింగ్ గేమ్ ను చూసే అవకాశం శాశ్వతంగా దూరమైంది. ఢిల్లీ సమీపంలోని నజఫ్ గఢ్ లో జన్మించిన సెహ్వాగ్ భారతీయ క్రికెట్ ఆణిముత్యాల్లో ఒకడు.
వ్యక్తిగత రికార్డులు చెప్పుకొవడానికే. ఆటగాడి అసలైన సత్తా తన జట్టును గెలిపించడంలోనే ఉంటుంది. ఆ విషయంలో సెహ్వాగ్ కు ఘనమైన రికార్డే ఉంది. ప్రపంచంలో ది బెస్ట్ మ్యాచ్ విన్నర్స్ లోసెహ్వాగ్ ఒకడు. ఒత్తిడిని తట్టుకుని జట్టును గెలిపించడానికి వీరోచిత పోరాటం చేయం వెన్నతో పెట్టిన విద్య.
భారతీయ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన వీరుడు సెహ్వాగ్ ఒక్కడే. క్రికెట్ దేవుడు సచిన్ కు కూడా ఇది సాధ్యం కాలేదు. పైగా, ఒక్కసారికాదు రెండు సార్లు సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. 2004లో పాకిస్తాన్ పై, 2008లో దక్షిణాఫ్రికాపై ట్రిపుల్ సెచరీలు సాధించాడు. అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా వీరేంద్రుడు ఘనత వహించాడు. వన్డేల్లో విండీస్ పై డబుల్ సెంచరీ చేశాడు. చివరిసారిగా ఒక అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడాలని సెహ్వాగ్ కోరాడు. కానీ బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. దీంతో బాధపడిన సెహ్వాగ్, తన 37వ పుట్టిన రోజు నాడే రిటైర్మెంట్ ప్రకటించాడు. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ తో కలిసి క్రికెట్ ఆడటం తన అదృష్టమని చెప్పాడు.
పదహారేళ్ల కెరీర్ లో సెహ్వాగ్ ఎన్నో రికార్డులు సాధించాడు. టెస్టుల్లో 22, వన్డేల్లో 15 సెంచరీలు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే దూకుడు స్వభావం సెహ్వాగ్ సొంతం. అందుకే మోస్ట్ డైనమిక్ బ్యాట్స్ మెన్ గా పేరు పొందిన అతి కొద్ది మందిలో ఒకటిగా నిలిచాడు. బ్యాట్ తో విరుచుకుపడిన సెహ్వాగ్, బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. పార్ట్ టైం బౌలర్ అయినా క్టిష్ట సమయంలో జట్టుకు ఉపయోగపడ్డాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన అరుదైన ప్లేయర్ ఇతడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.