Virupaksha movie review
రేటింగ్: 3/5
సుకుమార్ లోనే కాదు… సుకుమార్ శిష్యుల్లో కూడా చాలా మేటర్ ఉందన్న విషయం ఇది వరకటి సినిమాలే రుజువు చేశాయి. కుమారి 21, ఉప్పెన, దసరా… ఈ సినిమాలే ఇందుకు సాక్ష్యాలు. ఈ సినిమాలు తీసిన వాళ్లెవరూ సుకుమార్ స్టైల్‌ని ఫాలో అవ్వలేదు. వాళ్లకంటూ ఓ శైలి ఏర్పరచుకొని, ఓ కథని నమ్మి.. అదే చూపించారు. ఇప్పుడు సుకుమార్ నుంచి మరో శిష్యుడు వచ్చాడు. తనే… కార్తీక్ దండు. విరూపాక్షతో… ఓ థ్రిల్లర్ కథని కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించాడు. మరి… సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన ఈ స్టూడెంట్, బాక్సాఫీస్ పరీక్షలో పాస్ అయ్యాడా? విరూపాక్ష ఎలాంటి కథ..? కొంత గ్యాప్ తరవాత సినిమా చేసిన సాయిధరమ్ తేజ్‌కి ఎలాంటి ఫలితాన్ని అందించింది?
రుద్రవనం అనే ఊరి చుట్టూ తిరిగే కథ ఇది. అక్కడ అనుకోని మరణాలు సంభవిస్తుంటాయి. అమ్మవారి ఆలయంలోనే ఓ వ్యక్తి రక్తం కక్కుకుని చనిపోతాడు. ఊరికి అరిష్టం పట్టిందని, అమ్మవారు మైలు పడ్డారని, ఆ అరిష్టం పోవాలంటే, ఆ మైలు తొలగాలంటే…. 8 రోజుల పాటు ఊరిని అష్టదిగ్భంధనం చేయాలని నిర్ణయించుకొంటారు. ఈ 8 రోజులూ ఊరి నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదు. బయటివాళ్లు లోపలకి రాకూడదు. ఇంత నియమంగా ఉన్నా.. ఆ ఊర్లో మారణ కాండ ఆగదు. మరి… దీన్ని ఆపిందెవరు? ఇంతకీ ఆ ఊరికి ఏం జరిగింది? జాతర చూడ్డానికి పుష్కరం తరవాత ఊర్లోకి అడుగుపెట్టిన సూర్య (సాయిధరమ్ తేజ్)కి ఆ రుద్రవనంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? రుద్రవనంలో తాను మనసుపడిన నందిని (సంయుక్త మీనన్)ని సూర్య ఎలా కాపాడుకొన్నాడు? ఇంతకీ రుద్రవనం చుట్టూ ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే… విరూపాక్ష చూడాల్సిందే.
నమ్మకాలు, మూఢ నమ్మకాలు, దుష్ట శక్తి, ఆత్మ, పగ, ప్రేమ.. ఇలా ఒక్కటేంటి.. చాలా అంశాల మేళవింపు ఈ కథ. నిజానికి ఇన్ని దినుసులు వేస్తే.. తూకం చెడిపోయి, పాకం వికటిస్తుంది. కానీ… విటిని సమపాళ్లలో మేళవించి, ఎప్పుడు, ఎక్కడ, ఏ అంశాన్ని వాడుకోవాలో… దానికే ప్రాధాన్యం ఇస్తూ, ఏది చేసినా కమర్షియల్ పంథాని దాటుకోకుండా పోవడమే.. విరూపాక్ష గెలుపు సూత్రం. ఓ థ్రిల్లింగ్ ఎపిసోడ్ తో కథ మొదలెట్టాడు దర్శకుడు. ఆ సీన్ చూడగానే రుద్రవనం మామూలు ఊరు కాదని, ఆ ఊరు చుట్టూ ఏదో మిస్టరీ ఉందన్న విషయం తెలిసిపోతుంది. ఆ తరవాత హీరో (సాయిధరమ్) ఆ ఊర్లోకి అడుగుపెడతాడు. తొలి చూపులోనే నందిని (సంయుక్త మీనన్)ని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ కథకూ.. అసలు కథకూ లింకేంటబ్బా? అనవసరంగా ఈ లవ్ స్టోరీతో సినిమాని లాగ్ చేస్తున్నారా? అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే.. ఈ లవ్.. పతాక సన్నివేశాలు పండడానికి కారణమైంది. కాబట్టి… ఆ లాగ్ భరించాల్సిందే. ఈ ప్రేమకథ.. మధ్యమధ్యలో రుద్రవనంలో జరిగే మరణాలు.. ఇలా సమతూకంలోనే కథ సాగుతుంది. ఈ మరణాల మూలసూత్రం (పేట్రన్)ని హీరో ఛేదించడంతో కథ రసవత్తరంగా మారుతుంది. కథానాయికకు ప్రమాదం పొంచి ఉందన్న హింట్ ఇచ్చి, ఇంట్రవెల్ కార్డు వేశాడు.
ద్వితీయార్థం చూడ్డానికి కావల్సిన ఆసక్తిని తొలి సగంలోనే, ముఖ్యంగా విశ్రాంతి ఘట్టంలోనే అందించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. మరణాల పేట్రన్ అర్థమైతే సరిపోదు. అది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ మరణాల వెనుక కారణాన్నీ, సూత్రధారినీ తెలుసుకొని, ఈ మారణకాండకు అడ్డుకట్ట వేయడం అసలు పని. అక్కడే ఈ కథకు ఆయువు పట్టు దాగుంది. దాన్ని సైతం… సమర్థవంతంగానే చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షుకుడ్ని కొన్ని ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. వాటికి సమాధానం తెలుసుకోవాలనుకొంటాడు. ప్రేక్షకుడు సమాధానాన్ని ఊహించేలోగా.. దర్శకుడే ఆ ముడి విప్పేసి మంచి పని చేశాడు. పైగా ఆ చిక్కుముడి ప్రేక్షకుడి ఊహకు అందకుండా ఉండడం మరో ప్లస్ పాయింట్. ద్వితీయార్థాన్ని చక చక నడిపే ప్రయత్నంలో.. హీరో ముందే ప్రశ్నలకు సమాధానాలు వచ్చి పడిపోతుంటాయి. అందుకోసం హీరో పెద్దగా చేసేదీ ఉండదు. కాకపోతే..ఈ మైనస్సుల వల్ల బిగి సడలిపోవడం కానీ, కథనంపై ఆసక్తి తగ్గడం కానీ జరగదు. హీరోకి ఏదోలా తెలిసింది.. అది చాలు, అని ప్రేక్షకుడే సర్దుకుపోతాడు. క్లైమాక్స్ ట్విస్ మాత్రం… సర్ప్రైజ్ చేస్తుంది. అక్కడ వరకూ చిన్న చిన్న లోపాలున్నా అవన్నీ కొట్టుకుపోతాయి. అసలు గుట్టు విప్పాక.. కథని వీలైనంత త్వరగా ముగించాలి. అయితే.. దర్శకుడు ఇక్కడ చిన్న పొరపాటు చేశాడు. సంభాషణలతో కాస్త కాలక్షేపం చేశాడు. గ్రిప్పింగ్ గా సాగిపోతున్న స్క్రీన్ ప్లేలో అదో లోపం. హై ఓల్టేజ్ సీన్ లో.. ఇలా సంభాషణతో కాలయాపన చేయడం బాగోలేదు. ఈ కథని ముగించిన తీరు మాత్రం కాస్త విస్మయ పరుస్తుంది. పగ కంటే ప్రేమ గొప్పదని చాలామంది చాలా రకాలుగా వెండి తెరపై చూపించారు. విరూపాక్షతో.. మరొ కొత్తరకం కనిపిస్తుంది. ఎంతటి దుష్టశక్తి అయినా ప్రేమ ముందు తలొంచాల్సిందే అని నిరూపించింది.
సాయిధరమ్ ఇలాంటి కథని ఎంచుకోవడం సాహసమే. ఎందుకంటే ఇందులో హీరోగా ఎవరున్నా వాళ్లు చేయాల్సింది పెద్దగా ఉండదు. కథ.. దానంతట అది నడుచుకొంటూ పోతుంది. చివరి 15 నిమిషాలే హీరోకి కీలకం. ఆ పార్ట్ మాత్రం తేజ్ చక్కగా చేశాడు. ప్రమాదం తరవాత తేజ్ నటించిన సినిమా ఇది. సెట్లో డైలాగ్ చెప్పేటప్పుడు తేజ్‌కి నోట మాట కూడా రాలేదు. అలాంటిది బిగ్గరగా అరుస్తూ చెప్పాల్సిన సంభాషణలు ఇందులో ఉన్నాయి. మరి వాటిని తేజ్ ఎలా హ్యాండిల్ చేశాడో అనిపిస్తుంది. సంయుక్త మీనన్ ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా నా కెరీర్లో బెస్ట్ పెర్‌ఫార్మ్సెన్స్ ఇదే అని చెప్పేది. తన మాటల్లో అతిశయం ఏం లేదు. సినిమా ప్రారంభంలో గ్లామర్‌గా కనిపించిన సంయుక్త.. సినిమా గడిచే కొద్దీ.. తనలోని పెర్ఫార్మ్సెన్స్ని పెంచుకొంటూ పోయింది. పతాక సన్నివేశాల్లో అయితే వేరే లెవల్. సునీల్, రాజీవ్ కనకాల, బ్రహ్మజీ, సాయిచంద్.. వీళ్లందరికీ మంచి పాత్రలే పడ్డాయి.
థ్రిల్లర్ కథలకు టెక్నికల్ టీమ్ సపోర్ట్ చాలా కీలకం. ఎందుకంటే… సంగీతం, ఛాయాగ్రహణం, సౌండ్ ఎఫెక్ట్స్.. ఇవే ఈ కథని నిలబెడతాయి. విరూపాక్షకు టెక్నికల్ విభాగమే సగం బలం. కెమెరా పనితనం, సౌండ్ డిజైనింగ్ కథలో భాగం అయిపోయాయి. భయాన్ని, ఉత్కంఠతనీ పెంచడంలో సహాయపడ్డాయి. రుద్రవనం ఊరు కాదని, ఓ సెట్ అని చెబితే కానీ నమ్మలేం. అంత బాగుంది ఆర్ట్ పనితనం. ఒక్కటి మినహా… పాటలకు చోటు ఇవ్వకపోవడం తెలివైన నిర్ణయం. కథ ఎంత చెప్పాలి? కథలో ఏం చెప్పాలి? ఏది మినహాయించాలి? అనే విషయాలపైనే థ్రిల్లర్ కథల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. కార్తీక్ ఈ విషయంలో స్కేలుతో కొలిచినట్టు ఈ సినిమాని చెక్కుకొంటూ వెళ్లాడు. అనవసరం అనిపించే విషయాలు ఈ సినిమాలో పెద్దగా కనిపించవు. చిన్న చిన్న డిటైల్స్ బాగా పట్టాడు. అవే ఈ సినిమాకి మరింత థ్రిల్ యాడ్ చేశాయి.
థ్రిల్లర్ కథల్ని కమర్షియల్ కోణంలో చెబితే… జనంలోకి వెళ్లిపోవడం పెద్ద కష్టమేం కాదు. విరూపాక్షకు ఆ లక్షణం ఉంది. తెలుగులో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ని హారర్ ఎలిమెంట్స్ ఉన్న కథనీ చూసి చాలా రోజులైంది. ఆ లోటుని విరూపాక్ష తీర్చింది. సుకుమార్ శిష్యులెప్పుడూ ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలం కారన్న ట్రాక్ రికార్డుని ఈ సినిమాతో కార్తీక్ దండు కొనసాగించాడు.
రేటింగ్: 3/5