విశాఖలో అడ్మినిస్ట్రేషన్.. కర్నూలులో హైకోర్టు. చట్టసభలు ఏడాదిలో మహా అయితే.. నలభై రోజుల పాటు జరుగుతాయి కాబట్టి.. అమరావతి విషయం మర్చిపోవచ్చు. కానీ.. అడ్మినిస్ట్రేషన్, హైకోర్టుల మధ్య రోజువారీగా కార్యకలాపాలు ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయాలపై దాఖలయ్యే పిటిషన్లు.. ప్రజాప్రయోజనాల వ్యాజ్యల పిటిషన్లలో వాదన కోసం.. ప్రభుత్వాధికారులు ప్రతీ రోజూ హైకోర్టుకు పెద్ద సంఖ్యలో వెళ్లి వస్తూంటారు. ప్రస్తుత లెక్కల ప్రకారం… ప్రతీ రోజూ.. కార్యదర్శల స్థాయి అధికారులు కనీసం డజన్ మంది హైకోర్టులో వివిధ వనుల నిమిత్తం.. ప్రత్యక్షంగా వెళ్లి వస్తూంటారు. అలా వారంతా ఒక పూటలో కోర్టు పని చూసుకుని మరో పూట అధికార విధులు నిర్వహిస్తారు.
ఇక దిగువ స్థాయి అధికారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సచివాలయంలో న్యాయశాఖకు సంబంధించి సగం.. సిబ్బంది హైకోర్టు దగ్గరే ఉంటారు. హైకోర్టులో ప్రభుత్వం వాదిగానో.. ప్రతివాదిగానో ఉన్న కేసులే ఎక్కువగా విచారణ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో.. హైకోర్టును కర్నూలుకు… సెక్రటేరియట్‌ను విశాఖకు తరలిస్తే.. పాలనా పరంగా వచ్చే ఇబ్బందులకు లెక్కే ఉండదు. విశాఖ – కర్నూలు మధ్య దూరం ఏడు వందల కిలోమీటర్లు. అమరావతి నుంచి కర్నూలుకు 350 కిలోమీటర్లు. ఒక్క సారి ఒక్క అధికారి కోర్టు పని మీద కర్నూలుకు వెళ్లి రావాలంటే.. నాలుగు పని దినాలు వృధా అవుతాయి.
దేశంలో పలు రాష్ట్రాల్లో… సెక్రటేరియట్లు ఒకచోట… హైకోర్టులో ఒకచోట ఉన్నాయి. కానీ.. అక్కడ దూరభారం.. మరీ.. పన్నెండు గంటల జర్నీ చేసేంత ఏమీ లేవు. కొంత దగ్గరగానే ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం.. ప్రభుత్వం భిన్నంగా ఆలోచించింది. హైకోర్టుకు.. పాలనా కేంద్రానికి మధ్య ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నా పర్వాలేదనుకుంటంది. ప్రభుత్వ ఆలోచనల్లో ఏముందో కానీ… ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం.. అయితే.. ప్రభుత్వం.. రెండు, మూడు సొంత విమానాలు కొని.. ప్రభుత్వ అధికారుల కోసం ఫ్రీ సర్వీస్ నడపాల్సి ఉంటుంది. విశాఖలో ఎయిర్‌పోర్టు ఉంది. కర్నూలులో చంద్రబాబు హయాంలో ఎయిర్ పోర్టు కట్టారు. అందులో కూడా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికైతే అదొక్కటే చాయిస్. అలా ఏం లేదు.. హైటెక్ సౌకర్యాలతో.. విశాఖ నుంచే.. కర్నూలు హైకోర్టు కు సంబంధించిన ప్రభుత్వ వ్యవహారాలన్నీ చక్కబెట్టేయగలం అనుకుంటే.. అసలు కర్నూలులో హైకోర్టు పెట్టాల్సిన అవసరం ఏముందునే మౌలికమైన ప్రశ్న వస్తుంది..!