విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రుషికొండ ప్యాలెస్ లో హైకోర్టు బెంచ్ పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల జగన్ మాట్లాడిన మాటలను బట్టి ఆయన మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందన్నారు. జగన్ మాట్లాడిన మాటలు సినిమాల్లో బాగుంటాయని కానీ.. నిజంగా రాజకీయాలకు పనికి రావన్నారు., వైసీపీకి జగన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూటమికి ఎదురు ఉండదని.. గెలుస్తూనే ఉంటుందని…స్పష్టం చేశారు.
కూటమికి ఇక ముందు కూడా భారీ విజయాలు వస్తాయన్నారు. అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేతల్ని కూటమి పార్టీల్లోకి ఎప్పుడూ తీసుకునేది లేదని స్పష్టం చేశారు. జగన్ 2.0 అంటూ ఊహల్లో విహరించడం మానసిక సమస్యకు నిదర్శనమని.. భవిష్యత్తులో కూటమికి అన్నీ విజయాలే. వైసీపీకి అన్నీ అపజయాలేనని స్పష్టం చేశారు. విష్ణుకుమార్ రాజు అభిప్రాయం ప్రకారం ఉత్తరాంధ్రలో కూడా ఓ హైకోర్టు బెంచ్ పెట్టాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలపై పరిశీలనలు చేస్తోంది. త్వరలో న్యాయమూర్తుల బృందం కూడా పర్యటించి నివేదికను రెడీ చేసి సుప్రీంకోర్టుకు పంపించే అవకాశం ఉంది. విశాఖలో రుషికొండభవనాన్ని ఎలా వినియోగించాలన్న దానిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో రకరకాల ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. విష్ణుకుమార్ రాజు తన ప్రతిపాదన తాను చెప్పారు.