ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో విశాఖ జిల్లా కూడా ఒకటి. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రతీ ఏటా విశాఖ నగరంలో విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం ఎం.జి.ఎం పార్కులో పుష్ప ప్రదర్శనను ప్రారంభించడంతో విశాఖ ఉత్సవాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 3వ తేదీన ఉత్సవాల ముగింపు రోజున కార్యక్రమాలలో పాల్గొంటారు.
నేటి నుంచి మూడు రోజులపాటు సాగే ఈ విశాఖ ఉత్సవాలలో సామాన్య ప్రజలు ఎన్నడూ చూడలేని గరిడిసాములు, కత్తిసాము, తప్పెట గుళ్ళు, వీధి భాగోతాలు, పులివేషాలు వంటి అనేక జానపద కళా ప్రదర్శనలు చూడవచ్చును. అలాగే అరుకు, పాడేరు ప్రాంతాల నుండి వచ్చిన గిరిజన మహిళలు ప్రదర్శించే అత్యద్భుతమయిన నృత్యాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు బారీగా తరలివస్తుంటారు. ఇవేకాక ఈ మూడు రోజుల్లో జానపద, సాంఘిక, పౌరాణిక నాటకాల ప్రదర్శనలు, హరికధలు, బుర్రకధలు ఇంకా అనేక రకాల కళాప్రదర్శనలు నిర్వహించబడతాయి. నగరంలో ప్రధాన ఆకర్షణ కేంద్రాలయిన జాతర పార్కు, విశాఖ సాగరతీరం, కైలాసగిరి, భీమిలి బీచ్, ఎర్రమట్టి దిబ్బలు, తెన్నేటి పార్కు, ఉడా పార్క్ వంటి అనేక చోట్ల కళాకారులు నిర్వహించే ఈ ప్రదర్శనలతో ఊరంతా చాలా కోలాహలంగా పండుగ వాతావరణంతో నిండి ఉంటుంది.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది కళాకారులు, సినీ తారలు విశాఖ సాగర తీరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటుంటారు. క్రిందటిసారి ఉత్సవాలలో చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ వంటి అనేకమంది ప్రముఖ సినీతారలు పాల్గొన్నారు.