ఇంతవరకు ఉమ్మడి హైకోర్టు విభజనకు తెలంగాణా ప్రభుత్వం, న్యాయవాదులు, ఎంపీలు పోరాడుతూ వచ్చేరు. కానీ ఫలితం కనబడలేదు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ న్యాయవాదులు కూడా హైకోర్టు విభజన చేసి రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమం మొదలుపెట్టారు. హైకోర్టును విశాఖలో ఏర్పాటు చేయాలని విశాఖ బార్ అసోసియేషన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. హైకోర్టు ఏర్పాటు కోసం వారు ఒక జె.ఏ.సి.ని కూడా ఏర్పరుచుకొన్నారు. ఆ జె.ఏ.సి. పిలుపు మేరకు నిన్న విశాఖలో న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి ధర్నా, రాస్తా రోకోలు నిర్వహించారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని రాజధాని అమరావతిలో నిర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకొంది. రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తి కావడానికి మరో నాలుగేళ్ళు పట్టే అవకాశం ఉంది కనుక అంతవరకు హైకోర్టు విభజన జరిగే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఆంధ్రా, తెలంగాణా న్యాయవాదులు, ప్రజలు కూడా హైకోర్టు విభజించి తమ తమ రాష్ట్రాలకి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుకొంటున్నారు కనుక అమరావతిలో శాశ్విత హైకోర్టుని ఏర్పాటు చేసే వరకు విశాఖలో తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేసినట్లయితే అందరూ సంతోషిస్తారు.