కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర వాసుల కలను నెరవేర్చడానికి రెడీ అయింది. విశాఖ పట్నం రైల్వే జోన్‌కి పచ్చజెండా ఊపేయడానికి సిధ్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని పార్టీల నుంచి, ప్రజల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వస్తూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపి ప్రభుత్వం రైల్వే జోన్ కేటాయించనుంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికవడానిికి అన్ని విధాలుగా సాయం చేసిన చంద్రబాబు కూడా రైల్వే జోన్ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. పరువు నిలబడాలంటే ప్రత్యేక జోన్ ఇచ్చి తీరాల్సిందేనని బిజెపి ప్రభుత్వానికి స్ట్రాంగ్‌గా చెప్పారట. అతి త్వరలో వైజాగ్‌లో ఎన్నికలు కూడా ఉండడంతో వైస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి పైనే భారీ మెజారిటీతో బిజిపి అభ్యర్థిని గెలిపించిన వైజాగ్ ప్రజలకు మళ్ళీ మొహం చూపించాలంటే జోన్ ఇచ్చి తీరాల్సిందేనని రాష్ట్ర బిజెపి నేతలు కూడా గట్టిగా చెప్పారని సమాచారం.
ఆల్ హ్యాపీస్ అనుకుంటున్నారా? నిజంగా అలా చేస్తే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు? పైగా బిజెపికి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఒడిశా రాష్ట్రం చాలా చాలా ముఖ్యం. అందుకే తలను తీసేసి మొండేన్ని గిఫ్ట్‌గా ఇచ్చే నీచ రాజకీయానికి ఒడిగడుతున్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తే ఒడిశాలో ఏ స్థాయి నష్టం జరుగుతుందో బిజెపి నాయకులకు తెలుసు. అయితే రైల్వే జోన్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా నష్టం భారీగానే ఉంటుంది. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి ఎలాగూ లేనందున కనీసం రైల్వే జోన్ అయినా ఇవ్వకపోతే బిజెపికి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టే అవకాశమే ఉండదు. అందుకే చంద్రబాబు నాయుడు చాలా కాలంగా వాపోతున్న ఓ టెక్నిక్‌ని ఫాలో అవ్వాలని చూస్తున్నారు బిజెపి నేతలు. పేరుకు ప్రత్యేక హోదా ఇచ్చి లాభదాయకంగా ఉండే పారిశ్రామిక రాయితీలు ఏమీ ఇవ్వకపోతే ఏం చేస్తాం? అని చంద్రబాబు చాలా సార్లు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో అలా చెయ్యడానికి కూడా బిజెపి ముందుకు రాలేదు. కానీ ప్రత్యేక జోన్ విషయంలో మాత్రం ఆ సిద్ధాంతాన్ని అమలు చేసేస్తోందని వార్తలు వస్తున్నాయి. పేరుకు మాత్రమే ప్రత్యేక జోన్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కి ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల లాభం వస్తూ ఉంటుంది. ఇందులో దాదాపు 4 వేల కోట్ల రూపాయలు విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం పోర్ట్ మరియు గన్నవరం పోర్ట్‌ల నుంచి వస్తుంది. ఈ ఆదాయం మొత్తం కూడా కొత్తగా ఏర్పాటయ్యే విశాఖ రైల్వై జోన్‌కి రావాలంటే భారీగా రెవిన్యూ వచ్చే ఛత్తీస్‌ఘడ్ లాంటి లైన్స్‌ని ఈ జోన్‌కి కలపాలి. అలా చేస్తామంటే ఒడిశా ఒప్పుకునే అవకాశమే లేదు. అందుకే నరేంద్రమోడీ పార్టీ చంద్రబాబు భయాలను నిజం చేయడానికి రెడీ అవుతోంది. పేరుకు రైల్వే జోన్ ఇచ్చి ఆదాయం వచ్చే లైన్స్ అన్నీ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కి ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేయడానికి రెడీ అవుతోంది.
2014 ఎన్నికలలో నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు చెప్పిన మాటలకు…అధికారంలోకి వచ్చాక వాళ్ళ చేతలకు వీసమెత్తు సంబంధం కూడా ఉండడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తే ఇప్పుడు బిజెపి వాళ్ళు అంతకంటే ఎక్కువ ద్రోహం చేస్తున్నారు. కొత్తగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నరేంద్రమోడీని అందరికంటే ఎక్కువగా విశ్వసించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ‘తల్లిని చంపేసి…’ లాంటి భారీ సెంటింమెంట్ డైలాగ్స్‌తో ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అయ్యారు మోడీ. ఆయన అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా కారణమయ్యారు. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవాలన్న చిత్థశుద్ధి అయితే అస్సలు కనిపించడం లేదు. పైగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. అవమానిస్తున్న మాట కూడా వాస్తవం. ఇచ్చిన హామీలు నెరవేరుద్దాం, చెప్పిన మాటలకు కట్టుబడి ఉందాం అని చిత్తశుద్ధితో ఆలోచించడం కంటే కూడా ఎలా మాయ చేద్దాం? ఎలా ఎదరుదాడి చేద్దాం? మాటలతో మరోసారి ఎలా మోసం చేద్దాం అన్న ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నరేంద్రమోడీ నుంచి ఇలాంటి రాజకీయాలనైతే ఎవ్వరూ ఆశించడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకుంటుంది అన్న నమ్మకాలు ఆల్రెడీ సన్నగిల్లిపోయాయి. ఆ బాధలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఏదో చేస్తున్నట్టుగా కనిపించడానికి మాయ మాటలు చెప్తూ, వాళ్ళను మరోసారి మోసం చేయడానికి తెగబడడమంటే పుండుపైన కారం చల్లడమే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి తెలిసొచ్చింది. అదే రిజల్ట్ మాకూ కావాలన్న అభిలాష బిజెపికి కూడా ఉందేమో తెలియదు. విభజన సమయంలో సీమాంధ్రకు అన్యాయం చేసిన పాపం కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే నష్టం చేయలేదు. దేశం మొత్తం కూడా ఆ ప్రభావం కనిపించింది. ఇప్పుడు బిజెపి కూడా కాంగ్రెస్ అడుగుజాడల్లోనే నడిస్తే ఆ పార్టీ కూడా భవిష్యత్తులో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న దుస్థితిని ఫేస్ చేయడానిికి రెడీగా ఉండాలని చెప్పడానికి సందేహించక్కర్లేదు.