గత వైసీపీ ప్రభుత్వం హయంలో ఏపీలో సినిమా పరిశ్రమ పూర్తిగా దెబ్బతిందని, వైకాపా ప్రభుత్వంలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. సినీ నిర్మాతలు, కె.ఎస్.రామారావు, అశోక్‌కుమార్‌లతో కలిసి ఆయన విశాఖలో మాట్లాడారు.
ఏపీలోనూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌ను పెట్టాలన్న ఆలోచన వచ్చింది. టీడీపీ హయంలో రామానాయుడుగారి స్టూడియో వద్ద 5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వైకాపా ప్రభుత్వంలో కొందరు అసోసియేషన్ సభ్యులను బెదిరించి, వాళ్ల పదవులు లాక్కొన్నారు. గత ఐదేళ్ళుగా అభివృద్ధిని గాలికొదిలేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అసోసియేషన్‌లో వ్యక్తులు స్వచ్ఛందంగా తప్పుకొంటే మంచిది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ అలా చేయకపోతే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’ అని హెచ్చరించారు గంటా.
ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్‌గా వుందని చెప్పిన ఆయన కొత్త కమిటీ వచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, సీఎం చంద్రబాబుతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని, స్థానిక ఎమ్మెల్యేగా ఫిలింనగర్ క్లబ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు గంటా. భవిష్యత్‌లో సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు విశాఖ హబ్‌గా మారుతుందని నిర్మాతలు ఆకాంక్షించారు.