తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు రిమాండ్ విధించేందుకు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ తిరస్కరించారు. అరెస్టు చేసిన అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించింది. అయ్యన్న అరెస్ట్ కేసులో 467 సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేసింది. దీంతో అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లకు ఊరట లభించినట్లయింది.
దాదాపుగా నాలుగు వందల మంది వందల మంది పోలీసులతో తెల్లవారు జామును ఆయన ఇంటిపైకి వెళ్లి అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులకు షాక్ తగిలినట్లయింది. అయ్యన్న ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీని కేసు డెయిరీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో .. రిమాండ్‌కు తరలించేంత ఆధారాలు లేవని గుర్తించిన న్యాయమూర్తి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని చెప్పి.. రిమాండ్‌ను తిరస్కరించింది.
సీఐడీ పోలీసులు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి అసలు కేసులో నేరం ఎలా జరిగిందని చెప్పడానికి తంటాలు పడ్డారు. మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ వెళ్లిపోయారు. ఏఈ సంతకం ఫోర్జరీ చేశారని.. అయ్యన్న ఆయన కుమారులు చేశారని చెప్పుకొచ్చారు. ప్రాథమిక విచారణ చేశామని కూడా చెప్పుకొచ్చారు. మరి అయ్యన్నకు నోటీసులు ఇచ్చారా అంటే నీళ్లు నమిలారు. అరెస్టుకు సహకిరంచలేదని ఇంట్లోకి చొరబడ్డామని వాదించారు. కానీ కోర్టులో వారి పరువు మరోసారి పోయినట్లయింది.
రాజకీయ కక్ష సాధింపు ల కోసం సీఐడీని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం.. ఆ కేసుల్లో ఏమీ లేక కోర్టు కూడా రిమాండ్ విధించడానికి తిరస్కరించడం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. అక్రమ అరెస్టులు అని తేలుతున్నా.. సీఐడీపై ఏమీ చర్యలు తీసుకోలేకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ప్రైవేటు సైన్యం మాదిరిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.