హైదరాబాద్: దేశంలోని నగరాలన్నింటిలో మైసూరు అత్యంత స్వచ్ఛమైనదిగా, ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోని వారణాసి నగరం అత్యంత మురికి నగరాలలో ఒకటిగా తేలాయి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ జరిపిన సర్వే ఫలితాలను మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ ఢిల్లీలో ప్రకటించారు. పదిలక్షలకు పైగా జనాభా ఉన్న 73 నగరాలలో ఈ సర్వేను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరానికి 5వ స్థానం దక్కింది. 2014లో జరిపిన ఇదే సర్వేలో కూడా మైసూరు నగరమే ప్రథమ స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ ఏటి అత్యంత మురికి నగరంగా జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరం ఎంపికయింది. పది అత్యంత మురికి నగరాలలో ఉత్తర ప్రదేశ్‌లోనివే మూడు నగరాలు(వారణాసి, మీరట్, ఘజియాబాద్) ఉండటం విశేషం. స్వఛ్ఛ భారత్ మిషన్ ప్రభావం తెలుసుకోవటానికి ఈ సర్వే జరుపుతున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. సర్వేల వలన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై అవగాహన కూడా పెరుగుతుందని అన్నారు.