విశాఖపట్నం రైల్వే స్టేషన్.. దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ల జాబితాలో టాప్ ర్యాంక్ సాధించింది. దేశంలోని అత్యంత బిజీ రైల్వే స్టేషన్లపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ గౌరవం దక్కించుకుంది! క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిపోర్టును కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు విడుదల చేశారు. దేశంలోనే టాప్ క్లీనెస్ట్ స్టేషన్ గా వైజాగ్ ఉండగా.. తరువాతి స్థానంలో సికింద్రాబాద్ నిలిచింది. మూడో స్థానంలో జమ్ము ఉంది. దేశరాజధాని ఢిల్లీ ఈ ర్యాంకుల పట్టికలో 39వ స్థానంలో ఉంది. ఇక, ఈ లిస్టులో డర్టీయెస్ట్ స్టేషన్ గా బీహార్ లోని దర్బంగా నిలిచింది.
ఆంధ్రాలో రైల్వే స్టేషన్ కి ఈ ఘనత దక్కడం మెచ్చుకోవాల్సిందే. ఇదే తరుణంలో మరోసారి రైల్వే జోన్ గురించి చర్చ తెరమీదికి వస్తుందనడంలో సందేహం లేదు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాల్సిన అవసరాన్ని మరోసారి ఈ సందర్భంగా వివిధ మాధ్యమాల ద్వారా వినిపించే అవకాశం ఉంది. అయితే, ఈ దిశగా రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు కేవలం కంటితుడుపు చర్యలుగా మాత్రమే ఉంటున్నాయని చెప్పక తప్పడం లేదు. సరిగ్గా ఓ ఐదు రోజుల కిందటే.. ఆంధ్రాకి రైల్వే జోన్ ఇవ్వాలంటూ విశాఖ ఎంపీలు కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు కలసి రైల్వే బోర్డు ఛైర్మన్ ఎ.కె. మిట్టల్ కు ఒక వినతి పత్రం ఇచ్చారు. అంతే, రైల్వే జోన్ విషయంలో ఎంపీలు ఆ విధంగా కృషి, లేదా పోరాటం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు..!
ఇక, అధికార పార్టీ తెలుగుదేశం తీరు కూడా ఈ మధ్యనే పూర్తిస్థాయిలో బయటపడింది! పార్లమెంటు సాక్షిగా ఇస్తామన్న ప్రత్యేక హోదానే చేజార్చుకున్న చంద్రబాబు సర్కారు… ఇక రైల్వే జోన్ సాధనకు చేస్తున్న పోరాటంలోని చిత్తశుద్ధి ఏపాటిదని మాట్లాడుకోకూడదు! గడచిన వారంలో విజయవాడలో రైల్వే బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశం నుంచి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అర్ధంతరంగా బయటకి వచ్చేసి… మీడియా ముందు విమర్శలకు దిగారు. ఆంధ్రాకి రైల్వే జోన్ ఇవ్వడం అధికారులకే ఇష్టం లేదన్నారు. కొద్దిరోజులు ఆగితే దీని గురించి కూడా ప్రజలు మరచిపోతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానితో ఎన్నిసార్లు భేటీ అయినా రైల్వే జోన్ ఎందుకు రావడం లేదని ఆయనా ప్రశ్నించారు..? ఇది రాయపాటి మాటగా భావించాలా..? టీడీపీ వైఖరిగా పరిగణించాలా..?
ఏతావాతా చెప్పొచ్చేది, కనిపిస్తున్నదీ ఏంటంటే… రైల్వే జోన్ డిమాండ్ పై తెలుగుదేశం పోరాడటం లేదు. ఆంధ్రా భాజపా నేతలు కూడా అంత సీరియస్నెస్ లేదు..! సాక్షాత్తూ కేంద్ర రైల్వే శాఖామంత్రినే ఆంధ్రా కోటాలో రాజ్యసభకు పంపినా కూడా… రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టుకోలేని పరిస్థితిలో టీడీపీ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. జోన్ తెస్తే ఆ క్రెడిట్ తో భాజపాకి ఏపీలో కొంత మైలేజ్ వస్తుందని తెలిసినా.. ఢిల్లీ పెద్దల్ని ప్రభావితం చేయలేని పరిస్థితి ఏపీ భాజపా నేతలది. కాబట్టి, ఇలాంటి ర్యాంకులు ఏవో వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసేసుకుంటేనే మంచిది..!