తమిళ నాట రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. సినిమా వాళ్ల రాకతో… అక్కడ రాజకీయాలకు సినీ గ్లామర్ తోడవుతోంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇప్పటికే అందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇప్పుడు విశాల్ కూడా జట్టు కట్టబోతున్నాడు. అవసరం అనుకొంటే తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని విశాల్ చెబుతున్నాడు. ”ప్రజలకు సేవ చేయాలని ఎవరి ఉండదు?? చేతిలో అధికారం ఉంటూనే ప్రజలకు సేవ చేయగలం అనుకొన్నప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా. సినిమాల ద్వారా ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నా. ఓ శాసన సభ్యుడికి రూ.2 లక్షల జీతం వరకూ ఉంటుంది. రూ.2 లక్షలతో నా జీవితం సాగిపోతుందనుకొన్నప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా” అని సెలవిచ్చాడు విశాల్.
సెన్సార్, జీఎస్టీలపై కూడా తనదైన శైలిలో స్పందించాడు విశాల్. రాజకీయాల పార్టీలన్నీ మూకమ్మడిగా అభ్యంతరాలు చెప్పుకొంటూ పోతే.. చివరికి సెన్సార్ సర్టిఫికెట్ తప్ప, చూపించడానికి ఇంకేం మిగలదని వ్యంగ బాణాలు విసిరాడు. సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే ఓ డిగ్రీ సర్టిఫికెట్ సంపాదించాల్సినంత తతంగం ఉందని సెటైర్లు వేశాడు. విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిటెక్టివ్’ ఈనెల 10న విడుదల అవుతోంది. తమిళంలో ఈసినిమా మంచి హిట్ అయ్యింది. విశాల్‌కి బ్రేక్ ఇచ్చింది. తెలుగులో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.