తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యువకుడు విశాల్. నిర్మాత కొడుకైన విశాల్.. యాక్సిడెంటల్‌గా హీరో అయ్యారు. నిలదొక్కుకున్నారు. పందెంకోడి సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా.. ఇటీవల డిటెక్టివ్, అభిమన్యుడు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌తో మంచి విజయాలను అందుకుని రేసులోకి వచ్చారు. విశాల్‌కి ఉన్న మరో లక్షణం ఫైటింగ్ స్పిరిట్. అందుకే ఆయన తమిళనాట నడిగర్ సంఘంతో పాటు… నిర్మాతల మండలికి కూడా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ పదవులేమీ అంత తేలిగ్గా రాలేదు. సినిమాల్లో ఎన్ని మలుపులుంటాయో.. అన్ని మలుపులనూ దాటుకుని వచ్చి విజేతగా నిలిచారు.
సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే గుణం కూడా ఉంది. చెన్నై వరదల్లో స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జల్లికట్టు సహా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తమిళనాడు ఢిల్లీలో పోరాటం చేస్తున్నప్పుడు వారి కోసం… తన వంతు సాయం చేశారు. అప్పుడే.. తన సినిమాలకు సంబంధించి ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోతే… అన్ని రూపాయలు… రైతులకు ఇస్తానని ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత విశాల్వి ఎన్ని సినిమాలు రిలీజయ్యాయి..? ఎన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి..?. ఎంత మేర రైతులకు సాయం అందింది అనే వివరాలు పెద్దగా బయటకు రాలేదు కానీ… ఏదో రూపంలో తమిళ రైతులు .. సాయం చేరే ఉంటుంది. ఇప్పుడీ ఆలోచనను… విశాల్… తెలుగునాట కూడా.,. వర్తింప చేశారు. తన కొత్త సినిమా అభిమన్యుడు.. తొలి వారంలో రూ. 12 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా.. తన వంతు సాయం చేయాలనుకున్నారు. టిక్కెట్కో రూపాయి చొప్పున విరాళం ప్రకటించారు.
బాగానే ఉంది కానీ…దీనిపై స్పష్టత ఉండాలి కదా..?. ఎంత మేర విరాళాలు వస్తాయి..? ఎలా ఖర్చు పెడతారు..? ఏపీ రైతులకు ఇస్తారా..? తెలంగాణ రైతులకు ఇస్తారా..? అన్న డౌట్లు చాలా మందికి వస్తాయి. దీనిపై విశాల్ త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల రైతులు.. తమిళనాడు రైతులు నిరసన చేపట్టినంత దుర్భమైన పరిస్థితుల్లో అయితే లేరనేది వాస్తవం. తమిళాడు రైతులు ఢిల్లీలో ఎలుకలు నోట్లో పెట్టుకుని..నగ్నంగా రోడ్లపై పొర్లాడి..తన దుస్థితిని తెలియజెప్పారు. ఏపీ, తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. మరి రైతుల కోసం.. విరాళం ఇవ్వాలని విశాల్‌కు ఎలా అనిపించిందో మరి..!. రైతులకు ఎంత సాయం చేసినా తక్కువే అని విశాల్ భావిస్తూండొచ్చు.
ఇదే కాదు.. ఇప్పుడు విశాల్ నిర్ణయంతో టాలీవుడ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసుకునే హీరోనే.. ఇక్కడి రైతులకు టిక్కెట్కో రూపాయి ఇస్తే.. సొంతంగా సినిమాలు తీసుకుని కోట్లు సంపాదిస్తూ… మీరెందుకు సైలెంట్‌గా ఉంటున్నారన్న ఒత్తిడి తెలుగు హీరోలపై పడుతుంది. దీనిపై స్పందించాల్సిన పరిస్థితి హీరోలకు రావొచ్చు. ఇప్పుడిప్పుడే కాకపోయినా.. రైతుల కష్టాలు తెరపైకి వచ్చిన ప్రతీ సారి.. విశాల్ నిర్ణయం ఎఫెక్ట్ తెలుగుహీరోలపై ఉంటుంది. వారెలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరం. మొత్తానికి టాలీవుడ్ హీరోలను విశాల్ ఇరకాటంలో పెట్టేసినట్లే.. !