పందెం కోడి లా తెలుగు తెరకు దూసుకొచ్చిన హీరో… విశాల్. యాక్షన్ హీరోకి కావల్సిన హంగులన్నీ విశాల్ లో కనిపిస్తాయి. కథ నచ్చితే చాలు… నిర్మాతని చూసుకోవాల్సిన అవసరం లేదు.. అనే భరోసా విశాల్ కల్పిస్తాడు. అందుకే… తనతో సినిమాలు చేయడానికి కొత్త దర్శకులంతా ఎగబడుతుంటారు. తెలుగులో విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. ఏ సినిమా చేసినా.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండేలా జాగ్రత్త పడతాడు. తన తాజా చిత్రం `చక్ర` విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా విశాల్ తో చిట్ చాట్…
* డబ్బింగ్ సినిమాలే చేసినా.. తెలుగులోనూ మీకంటూ ఓ మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఏమనిపిస్తోంది?
– ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీలవుతుంటాను. కొన్ని సార్లు ఆనందంతో నా కళ్లు చెమ్మగిల్లుతాయి. 2004లో నా మొదటి సినిమా విడుదలైంది. ఈ 17సంవత్సరాలుగా నాకు అండగా ఉన్నతెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక దన్యవాదాలు. ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల,కన్నడ భాషలతో పాటు హిందీలోనూ విడుదలవ్వడం హ్యాపీగా ఉంది.
* చక్ర.. ఎలాంటి కథ?
– ఈ సినిమాలో హీరో ఫాదర్‌కి కేంద్ర ప్రభుత్వం యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే ఉన్నత పురస్కారం అశోక చక్ర అవార్ట్ వస్తుంది. అయితే కొంత మంది దుండగులు దాన్ని దొంగిలించడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మిలో పనిచేసే ఒక సైనికుడు దాన్ని ఎలా చేధించాడు అనే విషయం మీద సినిమా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమాలో లాస్ట్ 9 మినిట్స్ ఒక థ్రిల్లింగ్ సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా బాగా వచ్చింది. డెఫినెట్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది.
* ప్రచార చిత్రాలు చూస్తోంటే అభిమన్యుడు సినిమాకి సీక్వెల్ అనిపిస్తోంది..?
– లేదండీ! నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే అభిమన్యుడు సినిమాలాగా అనిపిస్తుంది అని కాని అభిమన్యుడు సినిమాకి, ఈ సినిమాకి మూడు సిమిలారిటీస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఇది కూడా సైబర్ క్రైమ్ థ్రిల్లర్, రెండోది ఈ సమాజంలో జరుగుతున్న విషయాలు డైరెక్ట్‌గా స్క్రీన్ మీద చూపించడం, మూడోది ఈ సినిమాలో కూడా నేను మిలటరీ ఆఫీసర్‌గా నటించడం ఈ మూడు తప్ప మిగతా స్క్రిప్ట్ అంతా చాలా కొత్తగా ఉంటుంది.
* చక్రలో రొటీన్ కి భిన్నంగా అనిపించే విషయాలేంటి?
– మనం ఎదైనా ప్రదేశానికి వెళ్లాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మరుక్షణమే దానికి సంభందించిన డీటైల్స్ టెక్ట్స్ మెసేజ్ రూపంలో మనకి వస్తుంది. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఆ ప్రదేశానికి సంభందించిన బెస్ట్ డీల్స్, బెస్ట్ హోటల్స్ అని యాడ్ రావడం మీరు గమనించే ఉంటారు. అంటే మనకి ఏం కావాలి?, మనం ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నాం అనే విషయాలపై మరొకరి నిఘా ఉంది అని అర్ధం. వాటితో పాటు మీకు లాటరి వచ్చింది మీ అకౌంట్స్ డీటైల్స్ ఇవ్వండి.. డబ్బులు పంపిస్తాం అని మనకు మైయిల్స్ వస్తుంటాయి అలా పంపిస్తే మన అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇలాంటి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజెప్పే చిత్రమిది.
* ఈకథ విషయంలో ముందస్తు కసరత్తులు ఏమైనా చేశారా?
– ఇలాంటి సున్నితమైన అంశాలమీద సినిమా చేస్తున్నప్పుడు కచ్చితంగా సమాజంలో జరిగింది, జరుగుతున్న విషయాల గురించి మాత్రమే చెప్పాలి. ఒకవేల మనం ఊహించి చెబితే దాని వల్ల సామన్య ప్రజలు ఇంకా ఎక్కువ భయపడే అవకాశం ఉంటుంది. ఈ కథ నాకు చెప్పడానికి ముందే దర్శకుడు ఎమ్ ఎస్ ఆనందన్ ఈ కథ మీద పూర్తి రీసెర్చ్ చేశాడు. ఈ కథ చెబుతున్నప్పుడే రెండు సన్నివేశాల్లో విజిల్ కొట్టాను. అంత బాగా కథ రాసుకున్నాడు దర్శకుడు ఆనందన్.
* దర్శకుడు ఎమ్ ఎస్ ఆనందన్ కి ఇదే తొలి సినిమా.. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా?
– మాములుగా ఒక కథ వినగానే దాని గురించి ఆలోచించుకోవడానికి కొంత టైమ్ కావాలి అని రెండు మూడు రోజుల్లో ఒకే చేస్తాం. కాని ఆనందన్ ఈ కథ చెప్పగానే ఒక కొత్త డైరెక్టర్ అని ఆలోచించకుండా వెంటనే ఒకే చెప్పాను. నాకు కథ అంత బాగా నచ్చింది. ఆనందన్ ఫస్ట్ సినిమాకే తన బెస్ట్ ఇచ్చాడు. మేకింగ్ పరంగా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బేనర్లో మరో టాలెంటెడ్ డైరెక్టర్ ని పరిచయం చేయడం హ్యాపీగా ఉంది.
* యువన్ శంకర్‌రాజాతో మీకు ఇది పదో సినిమా. వరుసగా తనకే ఆఫర్ ఇస్తారెందుకు?
– యువన్ శంకర్ రాజా నా బెస్ట్ ఫ్రెండ్, నేను అతన్ని ఒక ఓన్ బ్రదర్‌లా ఫీలవుతాను. మా ఇద్దరి కాంభినేషన్ తప్పకుండా ఒక మ్యాజిక్ చేస్తుందని నేను నమ్మతాను అందుకే అతనితో ఫైట్ చేసైనా సరే నా మూవీస్ కి వర్క్ చేయించుకుంటాను. ఈ సినిమాకి యువన్ కావాలని ఎందుకు కోరుకున్నాను అంటే ఒక కొత్త డైరెక్టర్‌కి మంచి టెక్నీషియన్ బ్యాకప్ ఉంటే తను అనుకున్న దాని కన్నా సినిమా ఇంకా బాగా తీయగలడు. యువన్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ తో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ కూడా ఇచ్చాడు. రేపు థియేటర్లలో ఆడియన్స్ కూడా ఇదే ఫీలవుతారు. నా తదుపరి రెండు చిత్రాలకు కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్.
* మీ తరువాతి సినిమా గురించి?
– నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్యతో కలిసి `ఎనిమీ` అనే సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో వాడే నా `ఎనిమీ`. అలాగే నా డైరెక్షన్లో అభిమన్యుడు – 2 చేస్తున్నాను. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఆ తర్వాత శరవణన్ అని ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ మంచి కథ చెప్పాడు. ఆ సినిమా కూడా వన్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం ఉంది. ఇవే కాకుండా వచ్చే ఏడాది ఉగాదికి ఒక స్ట్రయిట్ తెలుగు మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. వీటితో పాటు మరికొన్ని కథలు విన్నాను త్వరలోనే వాటి గురించి వివరిస్తాను.