ఎవరైనా అప్పు తీర్చిన తరవాత డాక్యుమెంట్లు ఇవ్వకుండా.. ఆ డాక్యుమెంట్లు అడ్డు పెట్టుకుని అప్పు తీర్చలేదని ఆరోపణలు చేస్తూంటే… అప్పు తీర్చిన వారు రచ్చ చేస్తారు. కానీ అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా.. అప్పు తీర్చేశారు బాబు.. తీర్చేసినట్లుగా రాసిచ్చాం కూడా అని మొత్తుకుంటున్నా వినకుండా.. రచ్చ చేస్తే దాన్నేమనాలి. తమిళ హీరో విశాల్ అదే చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత.. ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర విశాల్ అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలో ప్రామిసరినోట్లు.. చెక్కులు.. ఇచ్చాడు. ఇదంతా శివకుమార్ అనే మధ్యవర్తి సమక్షంలో జరిగింది. ఆ డాక్యుమెంట్లు, చెక్కులు కూడా శివకుమార్ దగ్గరే ఉన్నాయి.
ఆ తర్వాత విశాల్ ఆ అప్పు తీర్చేశాడు. తీర్చేసినట్లుగా ఆర్బీ చౌదరి ఓ పత్రం కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆర్బీ చౌదరే చాలా స్పష్టంగా చెప్పారు. విశాల్‌కు ఇచ్చిన అప్పు తిరిగి ఇచ్చేశాడని చెబుతున్నారు. అయితే.. విశాల్ ప్రధాన అభియోగం ఏమిటంటే.. అప్పు తిరిగి చెల్లించి కొన్ని నెలలు గడుస్తున్నా..చెక్ లీవ్స్, బాండ్స్ ప్రామిసరీ నోట్స్ తిరిగి ఇవ్వడం లేదని నేరుగా కేసు పెట్టారు. పత్రాలను తిరిగి ఇవ్వాలని నాలుగు నెలలకు పైగా అడుగుతున్నా ఇవ్వలేదని విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపైనే ఆర్బీ చౌదరి స్పందించారు. మధ్యవర్తిఅయిన శివకుమార్ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని.. కానీ ఆయన ఆకస్మికంగా చనిపోవడంతో వాటిని ఎక్కడ పెట్టారో తెలియడం లేదని ఆర్బీ చౌదరి అంటున్నారు.
అప్పులు తిరిగి చెల్లించినా… ఆ డాక్యుమెంట్లను అడ్డం పెట్టుకుని…చెల్లించలేదని భవిష్యత్‌లో ఎప్పుడైనా కేసులు పెడతారేమోనని.. విశాల్ ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోందని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అయితే.. స్వయంగా ఆర్బీ చౌదరే… అప్పు చెల్లించేశారని ఒప్పుకున్న తర్వాత.. ఎందుకు విశాల్ కంగారు పడుతున్నారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయేమోనని మరికొంత మంది అంటున్నారు.