దర్శకుడవ్వాలని ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టినవాళ్లలో విశాల్ ఒకడు. అయితే హీరో అయిపోయాడు. దర్శకత్వం అనే కల పక్కన పెట్టాడు. ఇప్పుడు అనుకోకుండా దర్శకత్వ బాధ్యతలూ మోయాల్సివస్తోంది. విశాల్ కథానాయకుడిగా వచ్చిన `డిటెక్టీవ్` మంచి విజయాన్ని అందుకుంది. మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లోనే `డిటెక్టీవ్ 2` కూడా పట్టాలెక్కింది. 25 శాతం షూటింగ్ అయ్యిందో లేదో.. మిస్కిన్ ఈ సినిమా నుంచి బయటకు వెళ్లిపోయాడు. విశాల్ – మిస్కిన్ మధ్య విబేధాలు తలెత్తాయని, అందుకే ఆయన బయటకు వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. మిస్కిన్ గైర్హాజరీతో ఆపధర్మ దర్శకత్వ బాధ్యతలు విశాల్ నెత్తిమీద పెట్టుకుని సినిమా పూర్తి చేస్తున్నట్టు టాక్.
ఈ గొడవలకు కారణం… దర్శకుడి వైఖరే అని తెలుస్తోంది. ముందు అనుకున్న బడ్జెట్ వేరని, తీరా సెట్స్‌పైకి వెళ్లాక అవుతున్న ఖర్చు వేరని అందుకే.. విశాల్ అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. 40 కోట్లతో ఈ సినిమాని పూర్తి చేయాలనుకున్నారు. అయితే సగం సినిమా కూడా అవ్వకుండానే 40 కోట్లూ ఖర్చు చేసేశాడు మిస్కిన్. దాంతో విశాల్ మిస్కిన్‌ని తప్పించాడని చెబుతున్నారు. ఈ గొడవపై మిస్కిన్ చాలా వెటకారంగా స్పందించాడు. తాను 40 కోట్లు అడగలేదని, 400 కోట్లు అడిగానని, శాటిలైట్ నుంచి హీరో దూకే సన్నివేశానికే 100 కోట్లు ఖర్చయ్యిందని వెటకారంగా ట్వీట్ చేశాడు మిస్కిన్. అయితే ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాడో అసలైన కారణం మాత్రం వివరించలేదు. మొత్తానికి విశాల్ దర్శకత్వ కల ఈ రూపంలో తీరుతోందన్నమాట.