విశాల్కంటూ ఓ ఇమేజ్ ఉంది. మార్కెట్ ఉంది. యాక్షన్ సినిమాలతో పాటుగా కాన్సెప్ట్ కథలు చేస్తుంటాడు. తెలుగులో కూడా విశాల్ చిత్రాలకు ఆదరణ బాగుంటుంది. అయితే ఆమధ్య విశాల్ సరైన కథల్ని ఎంచుకోవడం లేదు. కథల్లో వైవిధ్యం చూపించడం లేదు. ఇప్పుడు ఓ హిట్ కొడితే కానీ, తన కెరీర్‌కి జోష్ రాదు. ఇలాంటి పరిస్థితుల్లో చేస్తున్న సినిమా ‘రత్నం’. హరి ఈ చిత్రానికి దర్శకుడు. తనది కూడా కంప్లీట్ యాక్షన్ దారే. అందుకే వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కచ్చితంగా యాక్షన్ సినిమానే అయ్యుంటుంది. అందులో అనుమానం లేదు. ఈనెల 24న ఈ సినిమా విడుదల అవుతోంది.
ఇప్పుడు ట్రైలర్ వదిలారు. 2 నిమిషాల ట్రైలర్ లో మొత్తంగా యాక్షన్ హంగామానే కనిపించింది. కత్తులు పట్టుకొని వెంటాడడం, నరుక్కోవడం, వార్నింగ్ ఇవ్వడం ఇవే కనిపించాయి. సాధారణంగా ట్రైలర్లో అన్ని రకాల ఎమోషన్స్ మిక్స్ చేయడానికి చూస్తారు. కానీ ట్రైలర్ తొలి షాట్ నుంచి చివరి షాట్ వరకూ అంతా యాక్షనే. ఆఖరికి యోగిబాబు చేత కూడా ఫైట్ చేయించారు. గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్ర పోషించడం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడం ప్రధాన ఆకర్షణలు. ‘తమిళనాడు బోర్డర్లో ఏం జరుగుతోంది?’ అనే బిల్డప్ ముందు క్రియేట్ చేశారు. ”ఆ అమ్మాయి నా ప్రాణం నా ప్రాణం ఊపిరి.. తన జోలికొస్తే వెదుక్కొంటూ వచ్చి నరికేస్తా” అంటూ విశాల్ తో డైలాగ్ చెప్పించారు. దాన్ని బట్టి ఈ సినిమా మూడ్ అర్థం చేసుకోవొచ్చు. హరి సినిమాల్లో యాక్షన్‌తో పాటు, స్క్రీన్ ప్లేలో వేగం ఉంటుంది. ఆ రెండూ కలిస్తే.. ఈ సినిమా మాస్కు నచ్చొచ్చు.