కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసీపీకి దారి తెలుస్తున్నట్లుగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని అర్థమైందేమో కానీ ఇప్పుడు సినీ హీరోను చంద్రబాబుపై పోటీకి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ హీరో విశాల్ రెడ్డిని ఇందు కోసం సంప్రదించారని వైసీపీలోని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. నెల్లూరుకు చెందిన విశాల్ రెడ్డి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. సామాజికవర్గ పరంగా వచ్చిన సాన్నిహిత్యంతో ఆ కుటుంబానికి వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి.
విశాల్ రెడ్డికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంది. కాకపోతే ఆయన తమిళ రాజకీయాల్లో ఉన్నారు. ఓ సందర్భంలో అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాల్లో భాగమయ్యారు. శశికళ జైలుకెళ్లిన తర్వాత జయలలిత నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీటీడీ దినకరన్‌పై ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. నామినేషన్ పత్రాలతో వెళ్లినా చివరికి వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు. ఏపీ రాజకీయాలపై ఆయనకు ఆసక్తి ఉందో లేదో కానీ వైసీపీ వర్గాలు విశాల్ రెడ్డి పేరు ప్రచారంలోకి తెచ్చాయి.
ప్రస్తుతం కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి కుమారుడు. ఇప్పుడు చంద్రమౌళి చనిపోయారు. కానీ ఆయన చంద్రబాబుకు పోటీ ఇవ్వలేరని వైసీపీ నిర్ణయించుకుంది. అందుకే కొత్త అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. సినీ తార అయితే బెటరని విశాల్ పేరు పరిశీలిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం పెద్దగా లేకపోయినప్పటికీ.. తమిళ ఓటర్లు ఉన్నారని వాళ్లు ఓట్లేస్తారని వైసీపీ భావన. విశాల్ రెడ్డి మాత్రమే కాదు.. మరో ఇద్దరు బీసీ నేతల పేర్లను కూడా ప్రచారంలోకి తెస్తున్నారు.
విశాల్ రెడ్డి సినిమా కెరీర్ ఏమంత ఉత్సాహంగా సాగడం లేదు. ఆయనపై రకరకాల వివాదాలు ఉన్నాయి. తమిళసినీ పరిశ్రమలో ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలోనూ ఆయనను బద్నాం చేస్తున్నారా లేకపోతే.. నిజంగానే అలాంటి ఆలోచన విశాల్‌కు ఉందా అన్నది ఆయన చెబితేనే తెలుస్తుంది.