హీరోయిజం అంటే కెమెరా ముందు నాలుగు మాస్ డైలాగులు చెప్పడమో, డూప్ సహాయంతో వంద మందిని ఒంటి చేత్తో చితకబాదడమో కాదు. అదే మంచితనం, మానవత్వం… నిజ జీవితంలోనూ చూపించడం. ఈ విషయంలో విశాల్ .. తన విశాల హృదయం చూపించాడు. రియల్ హీరో అనిపించుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ స్ఫూర్తిని తన భుజాల మీద వేసుకుని – శభాష్ అనిపించుకున్నాడు.
ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో… కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. ముఖ్యంగా 1800 పిలల్లలకు ఆయన చదువు చెప్పిస్తున్న మహోన్నత కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఆ పిల్లల్ని నేను చదివిస్తా…అని ముందుకొచ్చాడు విశాల్. ఇది ఆ 1800 మంది పిల్లల భవిష్యత్తుకీ భరోసా కల్పించడమే. పునీత్ చనిపోయాక.. చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. నివాళి అర్పించారు. పునీత్ ఎంత గొప్పోడో చెప్పారు. కానీ.. విశాల్ మాత్రమే అసలైన నివాళి అర్పించాడు.ఓ మంచి మనిషి.. మంచి మనసుతో చేసిన కార్యక్రమం….మధ్యలోనే ఆగిపోతే, దాన్ని తన భుజాలపై ఎత్తుకున్నాడు విశాల్. ఈ క్షణంలో.. పునీత్ ఆత్మ శాంతించి ఉండొచ్చు. పునీత్ చాలా అనాధశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు సాయం చేస్తున్నాడు. ఇప్పుడు అవి కూడా అనాథలైపోయాయి. వాటిని కూడా ఎవరైనా దత్తత తీసుకుంటే బాగుణ్ణు.