ఓ ఫ్లాప్ సినిమా.. విశాల్ ని ఇంకా వెంటాడుతోంది. ఆ సినిమా నష్టాల భారాన్ని నిర్మాతతో పాటు మోయాల్సిన పరిస్థితి వచ్చింది. విశాల్ నటించిన `యాక్షన్` సినిమా గుర్తుండే ఉంటుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ నష్టభారాన్ని విశాల్ భరించాలని నిర్మాతలు కోర్టు కెక్కారు. న్యాయ స్థానం కూడా ఇప్పుడు నిర్మాతలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో.. ఈ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు విశాల్ 8.3 కోట్లు చెల్లించాల్సివస్తోంది.
`యాక్షన్` సినిమాని 20 కోట్లతో తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ చివరికి 44 కోట్లు అయ్యింది. ఈసినిమాపై ఎంతో నమ్మకం ఉంచిన విశాల్ `ఈ సినిమా కచ్చితంగా 20 కోట్లు పైనే సాధిస్తుంది. లేని పక్షంలో.. ఆ డబ్బు నేనే ఇస్తా` అని నిర్మాతలకు మాటిచ్చాడట. అలానే ఎగ్రిమెంట్లు కూడా జరిగిపోయాయి. కానీ.. ఈ సినిమా 11.7 కోట్లు మాత్రమే తెచ్చుకుంది. మిగిలిన 8.3 కోట్లు విశాల్ చెల్లించాలని నిర్మాతలు డిమాండ్ చేశారు. అయితే… నష్టపరిహారంగా `చక్ర` అనే సినిమా తీయించాడు. ఇప్పుడు ఆ సినిమాని ఓటీటీలో అమ్మడానికి విశాల్ రెడీ అవ్వడంతో నిర్మాతుల కోర్టుని ఆశ్రయించారు. విశాల్ తన సినిమా `చక్ర`ని ఓటీటీకి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చిన న్యాయ స్థానం.. `యాక్షన్` సినిమాకి సంబంధించిన 8.3 కోట్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.