ఓ కేసు లేదు.. ఎఫ్ఐఆర్ లేదు… అరెస్ట్ చేసి తీసుకుపోతున్నామని వందల మంది పోలీసులతో చుట్టు ముట్టారు. తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ లో పేరు కోర్టులో ప్రవేశ పెట్టే ముందు పెట్టారు. కనీస ఆధారాల్లేవు. జైల్లో పెట్టారు. చంద్రబాబు లాంటి వారికే ఈ పరిస్థితి వస్తే ఇక నా పరిస్థితి ఏమిటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు. భయంతో వణికిపోతున్నారు. హీరో విశాల్ రెడ్డికీ అలాగే అనిపించింది. తనకూ భయం వేసిందని ఆయన అన్నారు. తాను నటుడ్నే కావొచ్చు కానీ… సామాన్యులమేనని ఆయన అంటున్నారు. ఎలా చూసినా విశాల్ సెలబ్రిటీ ఆయనకు కూడా ఇలాంటి లా అండ్ ఆర్డర్ … వ్యవస్థల పనితీరును చూసి భయం వేసిందంటే ఇక సామాన్యులకెవరు రక్షణ ?
ఏపీలో భయానక వాతావరణం
ఏపీలో వ్యవస్థలు పూర్తి స్థాయిలో దిగజారిపోయి చాలా కాలం అయింది. ప్రజలకు మానవ హక్కులే లేకుండా పోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే .. నోటీసులు ఇచ్చి పిలవడం ఏమీ ఉండదు.. అర్థరాత్రి గోడలు దూకి ఇళ్లల్లోకి చొరబడి మనుషుల్ని తీసుకుపోతారు. ఇది సీఐడీ పోలీసుల స్టైల్. డెకాయిట్లు, చంబల్ లోయలో దొంగలు అలా చేసేవారని గతంలో కథలు చదువుకునేవాళ్లం. కానీ ఏపీలో పోలీసులు అలా చేస్తారు. పులివెందుల ఎమ్మెల్సీ బీటెక్ రవి ఓ సారి విజయవాడ వచ్చేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అప్పటి వరకూ ఆయన పులివెందులలోనే ఉన్నారు. కానీ ఆయనను ఉద్దేశపూర్వకంగా ఓ పెద్ద నేరస్తుడ్ని అరెస్ట్ చేస్తున్న భ్రమను కల్పించడానికి ఎయిర్ పోర్టులో పెద్ద హడావుడి మధ్య అరెస్ట్ చేశారు. ఇలాంటి అరాచకాలు ఏపీలో జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.
వ్యవస్థలేవీ ప్రజలకు రక్షణ కల్పించడం లేదు !
ఏపీలో వ్యవస్థలేవీ ప్రజలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉంది, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ ఎన్నారైని అరెస్ట్ చేసిన పోలీసులు … అతను గే అని ప్రచారం చేశారు.. వ్యవస్థలు పక్కాగా ఉంటే.. ఇలాంటి ప్రచారం చేసిన పోలీసుల్ని సర్వీస్ నుంచి తొలగించేవారు. కానీ ఏపీలో నవ్వుకున్నారు. ఏ వ్యవస్థ కూడా బాధితులకు రక్షణగా లేదు. మానవహక్కులు.. కనీస హక్కులు కూడా దక్కనీయడం లేదు. అవి మా హక్కు అని ఎవరైనా అంటే.. అన్ని వ్యవస్థల నుంచి వికటాట్టహాసం వస్తోంది.
మాజీ సీఎంపైనే ఆధారాలు లేకుండా కేసులు… మరి సామాన్యులకెవరు దిక్కు ?
చంద్రబాబును అరెస్ట్ చేయడానికి కనీస ప్రాథమిక ఆధారాలను సీఐడీ ఎక్కడా చూపించలేదు. తప్పు చేశారని… డబ్బులు అందుకున్నారని ఎక్కడా చెప్పలేదు. న్యాయస్థానాల్లోనూ చెప్పలేదు. రెండున్నరేళ్ల కిందట నమోదు చేసిన కేసులో ఏ ఆధారం లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఆయనకే వ్యవస్థల నుంచి రక్షణ లేదు. మరి సామాన్యుల గోడు ఎవరు పట్టించుకుంటారు ?. ఏపీ ప్రజల్లో ఇదే ఆందోళన కనిపిస్తోంది. ఇంత భ యంకరమైన వాతావరణంలో ఎందుకు బతకాల్సి వస్తుందా అని కంగారు పడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో నివసించే విశాల్ రెడ్డికే అలా అనిపిస్తే.. మన రాష్ట్రంలో కుటుంబం కోసం సమయం మొత్తం వెచ్చించే… సగటు మధ్యతరగతి మానవుడికి అనిపించదా ? . దీనికి వ్యవస్థలే సమాధానం చెప్పాలి. తాము ప్రజల్ని రక్షిస్తామని భరోసా ఇవ్వగలగాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేనట్లే.