మంచు విష్ణు అదో టైపు! ఆశలు, ప్రణాళికలు, వ్యూహాలూ చాలా చాలా ఉంటాయ్. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం అవేం కనిపించవు గాక కనిపించవు. ఆశ లావు.. పీక సన్నం అంటారే… ఆ టైపు. ‘రావణ్’ అంటూ ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు అప్పుడెప్పుడో. ఆ ఊసు మర్చిపోయారంతా. రూ.50 కోట్లతో ‘కన్నప్ప’ సినిమా తీస్తున్నా.. అని చెప్పాడు. దాన్నీ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా మొదలెట్టాడు. ఈ రోజే ఈ చిత్రం కొబ్బరి కాయ్ కొట్టుంది. తెలుగుతో పాటు అటు తమిళంలోనూ మార్కెట్ విస్తరించుకోవాలన్న ఆశ తప్పేం కాదు. అలా చేయాలంటే ముందు… తెలుగులో బలమైన మార్కెట్ ఉండాలి కదా? విష్ణుకి అది ఉందా అని అడిగితే డౌటే.
విష్ణు కెరీర్లో సూపర్ హిట్ సినిమా.. ఢీ. ఆ తరవాత ఆ స్థాయిలో వసూళ్లు అందుకొన్న సినిమా లేదు. దేనికైనా రెడీ బాగానే ఆడింది కానీ.. విష్ణు పేరు చెబితే పొలోమంటూ వసూళ్లేం వచ్చేయవు. ఏ హీరో మార్కెట్ స్టామినా అంచనా వేయాలంటే తొలి రోజు వసూళ్లే కీలకం. టాక్ని పట్టించుకోకుండా టికెట్లు తెగితే.. ఆ హీరోకి మార్కెట్ ఉన్నట్టు లెక్క. విష్ణు సినిమా అంటే బాగుంటే చూస్తారు. లేదంటే లేదు. తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకోవడంలో విష్ణు విఫలం అవుతూనే ఉన్నాడు. విష్ణుకంటే తరవాతెప్పుడో వచ్చిన నాని, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, రాజ్ తరుణ్… ఇలాంటి వాళ్లంతా మెల్లిమెల్లిగా తమకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకొన్నారు. వీళ్ల సినిమాలు ఓవర్సీస్లోనూ ఆకర్షణీయమైన వసూళ్లు సాధిస్తుంటాయి. మాస్లో ఫాలోయింగ్ ఉంది. శాటిలైట్ రూపంలో గ్యారెంటీ రాబడి ఉంటుంది. ఓ రేంజు హీరోల సినిమాల శాటిలైట్ హక్కులకు మినిమం రెండు కోట్లయినా దక్కుతాయి. ఇవన్నీ రావాలంటే .. వైవిధ్యభరితమైన సినిమాల్ని ఎంచుకోవాలి. విష్ణు సినిమాకి వెళ్తే వినోదం గ్యారెంటీ అనే భరోసా దక్కాలి. అప్పుడే విష్ణు సినిమాకి గ్యారెంటీ వసూళ్లు కొన్ని దక్కుతాయి. ముందు వాటిపై విష్ణు దృష్టి పెట్టాలి. తెలుగులో మార్కెట్ విస్తరించుకొన్న తరవాత అప్పుడు తమిళం గురించి ఆలోచిస్తే బాటుంటుంది. మిగిలిన పెద్ద హీరోలంతా తమిళ మార్కెట్‌పై గురి పెట్టారని, తానూ ఓ చేయి వేస్తున్నాడేమో అనిపిస్తోంది.