ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రత్యేకహోదా కోసం.. అసెంబ్లీలో చేసిన తీర్మానం బీజేపీ శాసనసభా పక్షాన్ని చిక్కుల్లో పడేసింది. చంద్రబాబు.. భావోద్వేగంతో.. రాజకీయం చేయడంతో.. ఏం చేయాలో తెలియక… బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు.. కేంద్రంలోని సొంత పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, డిమాండ్లతో ఉన్న తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. కనీసం.. బాయ్‌కాట్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా.. చంద్రబాబు… పకడ్బందీగా వ్యవహరించడంతో.. విష్ణుకుమార్ రాజు పూర్తిగా ఇరుక్కుపోవడం… హాట్ టాపిక్ అయింది.
కేంద్రం విభజన హామీలు ఏవీ అమలు చేయలేదని.. చంద్రబాబు.. చాలా ఘాటుగా అసెంబ్లీలో తేల్చి చెప్పారు. అంతే ఆవేశంగా.. బీజేపీ సభ్యులకు సవాల్ విసిరారు. తాను చెప్పిన విషయాల్లో పొరపాటు ఏముందో నిరూపించాలన్నారు. బ్రిటిష్ వాళ్ళకు , బీజేపీ నేతలకు తేడా ఏముందని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం తెలిస్తే… ఈ గడ్డపై పుట్టిన అభిమానం ఉంటే తీర్మానాన్ని బలపరచాలని సిఎం ఎమోషనల్ సెంటిమెట్ తో సూచించారు. దీంతో విష్ణుకుమార్ రాజు.. తాను ముందు ఆంధ్రుడినని ప్రకటించుకున్నారు. ఆంధ్రాకు అన్యాయం జరిగితే తాను కూడా సహించనని తనకు ఆత్మగౌరవం ఉందని విష్ణుకుమార్ రాజు ఛాతిని పెంచుకుని మరీ చెప్పారు. అయితే ప్రత్యేకహోదా ఇవ్వొద్దని పధ్నాలుగో ఆర్థిక సంఘం చెప్పిందని వాదించే ప్రయత్నం చేశారు. దీన్ని వెంటనే చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. పధ్నాలుగో ఆర్థిక సంఘం.. ఎక్కడ చెప్పిందో… హోదా ఇవ్వవొద్దని… చూపించాలని సవాల్ చేశారు.
అంతటితో ఆగలేదు.. నేరుగా ఎటాక్ చేశారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్లీ మళ్లీ దెబ్బకొడుతున్నారని.. మండి పడ్డారు. విభజన పాపంలో భాగం అయిన మీరు రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం నేరుగా.. ఎటాక్ చేస్తూండటంతో.. తీర్మానంలోని అంశాను తిప్పికొట్టలేకపోయారు విష్ణుకుమార్ రాజు. చివరికి.. న్యాయం కోసం, ధర్మం కోసం మాట్లాడుతామని సిఎం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని విష్ణుకుమార్ రాజు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలా కేంద్రంలోని సొంత పార్టీ తీరును ఖండిస్తూ… తీర్మానాన్ని బలపరిచే పరిస్థితి రావడం అరుదే. కానీ విష్ణుకుమార్ రాజుకు తప్పని పరిస్థితిని చంద్రబాబు కల్పించారు.