వైసీపీకి అనుకూలంగా.. జగన్‌ను పొగుడుతూ మాట్లాడుతూ ఉండే భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హఠాత్తుగా భిన్నమైన స్వరం వినిపిస్తున్నారు. చంద్రబాబు విశాఖ పర్యటన.. విమానాశ్రయం దగ్గర పరిణామాలపై.. ఆయన ఘాటుగా స్పందించారు. విశాఖలో ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చే పద్ధతిని ఎవరూ ప్రోత్సహించవద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబును ప్రజలెవరూ అడ్డుకోలేదని .. రాజకీయ పార్టీల నేతల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని స్పష్టం చేశారు. గుడ్లు, చెప్పులు విసరడం సరికాదు..ఇలాంటి చర్యలతో వైసీపీకి చెడ్డ పేరు వచ్చిందన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత విష్ణుకుమార్ రాజు.. పూర్తిగా ప్రొజగన్ స్టాండ్ తీసుకున్నారు.
ఆయనకు సంబంధించిన కొన్ని భవనాల్లో.. తాత్కాలిక రాజధానికి సంబంధించిన కార్యాలయాలు పెట్టబోతున్నారని.. ఈ మేరకు.. చర్చలు జరిగాయన్న ప్రచారం కూడా జరిగింది. ఐటి హిల్స్‌లో విష్ణుకుమార్ రాజుకు.. అతి పెద్ద భవనం ఉంది. అది చాలా వరకు ఖాళీగా ఉంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖకు కార్యాలయాలు తరలించిన తర్వాత కొన్ని అక్కడ ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. అందుకే.. విష్ణుకుమార్ రాజు… జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని అనుకున్నారు. హఠాత్తుగా.. చంద్రబాబును విశాఖలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై… ఇతర బీజేపీ నేతలెవరూ స్పందించకపోయినా.. విష్ణుకుమార్ రాజు మాత్రం.. మీడియా ముందుకు వచ్చేశారు.
టీడీపీ చెబుతున్న విశాఖపై ఫ్యాక్షనిజం పడగ అనే వాదనను తాను కూడా వినిపించారు. మొత్తానికి బీజేపీ నుంచి.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కు సంబంధించి వైసీపీకి గట్టి మద్దతు దారుగా నిలబడినేత విష్ణుకుమార్ రాజు. చివరికి ఎమ్మెల్సీ మాధవ్ కూడా.. మద్దతు ఇవ్వలేదు. అమరావతికే మద్దతిచ్చారు. ఇప్పుడు ఈ నేత మద్దతును కూడా వైసీపీ కోల్పోయినట్లయింది.