మంచు విష్ణు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు ప్రకటించారు. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే… హీరో నుంచి వాళ్లకు ఎలాంటి సహకారం అందుతున్నట్టు కనిపించడం లేదు. జనవరిలో సినిమాను విడుదల చేస్తామని వాయిదా వేయడంతో నిర్మాతలపై మంచు విష్ణు ఆగ్రహం చేసినట్టు వార్తలు వచ్చాయి. అందులో ఎంత నిజం వుందనేది పక్కన పెడితే… నిర్మాతలు ఏవో కష్టాలు పడి సిన్మాను విడుదలకు సిద్ధం చేశారు. విడుదల తేదీ ప్రకటించారు. కానీ, హీరోగారు ‘ఏప్రిల్ 5న ఆచారి అమెరికా యాత్ర విడుదల’ అని ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా ఊసు ఎత్తడం లేదు. పోనీ, విష్ణు సోషల్ మీడియాకు దూరంగా వుంటారా? అంటే అదీ కాదు. రెండ్రోజుల క్రితం ట్వీట్ చేశారు. మరి, సొంత సినిమా విడుదలకు సంబంధించి ఒక్క ట్వీట్ వేస్తే ఆయన బాగుంటుంది కదా!
మంచు విష్ణు ఒక్కరే కాదు… ఆయన తమ్ముడు మనోజ్, ఆడపడుచు మంచు లక్ష్మి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎవరూ సినిమా గురించి ట్వీట్స్ వేయలేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ‘ఆచారి అమెరికా యాత్ర’పై ఈ మౌనమేల? విజయ్ దేవరకొండ ‘ఏ మంత్రం వేసావె’ తరహాలో ఇదేమీ ఏళ్ల క్రితం తీసిన సినిమా కాదుగా! నాలుగు నెలలు ఆలస్యం అయ్యిందంతే.