ఈ యేడాది ప్రారంభంలో వచ్చిన విష్ణు సినిమా లక్కున్నోడు బాక్సాఫీసు దగ్గర పల్టీలు కొట్టింది. అయితే ఆ ఫ్లాప్‌ని వెంటనే పక్కన పెట్టేసిన విష్ణు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడు విష్ణు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏక కాలంలో తెరకెక్కుతోంది. ఇప్పుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పేశాడు. జి.నాగేశ్వరెడ్డి – విష్ణు కాంబినేషన్లో రెండు సినిమాలొచ్చాయి. దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం మంచి విజయాల్ని సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కి రంగం సిద్ధమైంది. ఈ సినిమాకి `ఆచారి అమెరికా యాత్ర` అనే విచిత్రమైన టైటిల్ పెట్టినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.
వీరిద్దరి కాంబోలో వచ్చిన దేనికైనా రెడీ బాక్సాఫీసు దగ్గర విజయం సాధించినా… ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమాపై విరుచుకుపడ్డారు. మంచు ఫ్యామిలీకీ ఆ వర్గానికి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే.. ఇప్పుడ ఈ టైటిల్ కాస్త వివాదాల్లో పడే అవకాశం ఉంది. ‘ఆచారి..’ అనగానే దర్శకుడి టార్గెట్ ఏంటో, హీరో ఏం చేస్తుంటాడో అర్థం చేసుకోవొచ్చు. గతంలో జరిగిన వివాదాల్ని మర్చిపోయేలా ఈ సినిమా ఉంటుందా?? లేదంటే కొత్త గొడవలు రేగుతాయా?? అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి టైటిల్ అయితే… ఇంట్రస్టింగ్‌గానే ఉంది. మరి తీసే విధానం ఎలా ఉంటుందో చూడాలి.