ప్రముఖ నటుడు మోహన్ బాబు త్వరలో తను రాజకీయాలలోకి రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతుంటే, తనకేమీ సంబంధంలేనట్లు చూస్తూ ఊరుకోలేక వారి కోసం ఏదయినా చేయాలనే తపనతోనే రాజకీయాలలోకి రావలనుకొంటున్నట్లు మోహన్ బాబు చెప్పారు. అయితే తను ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నదీ చెప్పలేదు. త్వరలో తెలియజేస్తానని చెప్పారు.
ఆయన కుమారుడు మంచు విష్ణు ఇటీవల ఒక టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దీనిపై ఆయనను ప్రశ్నించగా, “మా నాన్నగారు రాజకీయాలలో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు. ఆయన మాతో కలిసి ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకొంటున్నాను. ఇప్పటికీ నా సినిమా స్క్రిప్ట్ లను ఆయన ఓకే చేసిన తరువాతనే నేను ముందుకు వెళుతుంటాను. సినిమా రంగంలో ఆయనకున్న అనుభవం మాకు, సినీ రంగానికి ఉపయోగించాలని నేను కోరుకొంటున్నాను,” అని చెప్పారు.
చాలా మంది సినీ హీరోలు తమ సినిమాలలో సమాజంలో అవినీతిపరులను అంతం చేసే పాత్రలు పోషిస్తుంటారు. అవి సినిమాలు గాబట్టి వారి హీరోయిజం హైలైట్ అయ్యేవిధంగా వారి పాత్రలు, సన్నివేశాలు అన్నీ ముందే తీర్చి దిద్దబడతాయి. కనుక విలన్లు ఎంత పెద్దవారయినా వారిని అవలీలగా నాశనం చేసి సమాజాన్ని కాపాడేస్తుంటారు. కానీ నిజజీవితంలో అదే హీరోలు తమ భూములను క్రమబద్దీకరించుకోవడానికో లేక మరొక పనులకో రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుండటం చూస్తూనే ఉన్నాము. అంటే సినిమాలో చేసి చూపినవి నిజ జీవితంలో చేయడం సాధ్యం కాదని వారే నిరూపిస్తున్నట్లు అర్ధమవుతుంది. భ్రష్టు పట్టిపోయిన వర్తమాన రాజకీయాలలోకి ప్రవేశించి వాటిని చక్కదిద్ది, సమాజానికి మేలు చేయడం చాల కష్టం. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలని ప్రజలు అసహ్యించుకొనే విధంగా వ్యవహరిస్తున్నాయి. మోహన్ బాబు ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే రాజకీయాలలోకి ప్రవేశించి, వాటిలో ఏదో ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని చేరితే వాటి మురికి ఆయనకి అంటకమానదు. ఆపాదించక తప్పదు. కనుక బాగా ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. లేకుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాగ ఆయన కూడా తన ప్రమేయం లేకపోయినా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తుంచుకోవాలి.