జనసేన పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలను.. విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ విష్ణురాజు తోసిపుచ్చారు. కొద్ది రోజుల కిందట.. విష్ణురాజు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి.. అధికారిక ప్రకటన వెలువడింది. విష్ణురాజు… జనసేన పార్టీలో చేరారని… ఆయనను జనసేన సలహామండలి అధ్యక్షుడిగా నియమించినట్లు పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. విద్యావేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు కలిపి మొత్తం ఏడుగురు సభ్యులు ఉండే ఈ మండలికి విష్ణురాజు నాయకత్వం వహిస్తారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారని.. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం లేదా.. తూర్పుగోదావరి జిల్లాలోని ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జనసేన వర్గాలు ప్రచారం చేయడం ప్రారంభించాయి.
ఈ ప్రచారాన్ని విష్ణురాజు.. మొదట్లో ఖండించలేదు. కానీ వారం రోజుల తర్వాత హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. తాను జనసేనలో చేరినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. కనీసం జనసేన పార్టీ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా కూడా తాను పని చేయడం లేదని మీడియాను పిలిచి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు కలిశానని.. విద్య, ఆరోగ్యం, స్మార్ట్ సిటీస్ అభివృద్ధి గురించి మాత్రమే తమ మధ్య చర్చ జరిగిందన్నారు. అడ్వైజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకే అంగీకరించానన్నారు..కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. ప్రత్యక్ష ఎన్నికల్లో అసలు పోటీ చేయబోనని ప్రకటించేశారు.
విష్ణురాజు హఠాత్తుగా.. ఇలాంటి ప్రకటన చేయడం.. జనసేన వర్గాల్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. నిజంగా ఆయన పార్టీలో చేరకపోయిఉంటే… సలహా మండలికి చైర్మన్ గా ఉండటానికి అంగీకరించకపోతే..అప్పుడే ఖండించి ఉండేవారని.. వారం రోజుల తర్వాత ఇలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమిటని.. జనసేన వర్గాలు ప్రశ్నిస్తన్నాయి. విష్ణురాజుపై రాజకీయ ఒత్తిడులు వచ్చి ఉండవచ్చని అందుకే ఆయన వెనక్కి తగ్గారని అంటున్నారు. కారణం ఏదైనప్పటికీ.. విష్ణురాజు విషయంలో… పవన్ కల్యాణ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.