‘భక్త కన్నప్ప’ని రీమేక్ చేయాలని, అందులో ప్రభాస్ నటించాలని కృష్ణంరాజు చాలా ఆశ పడ్డారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ ఈ సినిమా చేసే అవకాశాలు 1 శాతం కూడా లేవు. అయితే ఇదే స్క్రిప్టుపై మంచు విష్ణు ఏనాడో మనసు పడ్డాడు. తనికెళ్ల భరణితో ఓ స్క్రిప్టు రాయించాడు. ఆ కథతోనే సినిమా తీయాలని విష్ణు భావించాడు. అప్పట్లో ఈ సినిమా హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో నిర్మిస్తానని, అందుకు భారీ బడ్జెట్ అవసరం అవుతుందని విష్ణు చెప్పాడు. అయితే ఏమైందో ఏమో.. ఆ కథని పక్కన పెట్టేశారు. విష్ణు సినిమాలేం చేయకపోవడం, సొంత వ్యాపారాల మీద దృష్టి పెట్టడంతో ‘కన్నప్ప’ ఆలోచనే రాకుండా పోయింది.
ఇప్పుడు మళ్లీ విష్ణు వరుసగా సినిమాలు చేయాలని ఫిక్సయ్యాడు. అందులో భాగంగా ‘మోసగాళ్లు’ సినిమాని పట్టాలెక్కించాడు. పనిలో పనిగా ‘భక్తకన్నప్ప’ స్క్రిప్టు బూజు కూడా దులుపుతున్నాడు. ఈ యేడాది ఈ సినిమాని ఎలాగైనా మొదలెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు విష్ణు. ప్రీ ప్రొడక్షన్ పనుల్ని కూడా మెల్లగా మొదలెట్టేశాడట విష్ణు. ఈ సినిమాకి రూ.60 కోట్ల ఖర్చు అవుతుందని లెక్క గట్టారు. అయితే విష్ణుపై 60 కోట్లు పెట్టడం అత్యంత సాహసం అనుకోవాలి. ఈ సినిమాలో తమిళ, కన్నడ, మలయాళ స్టార్స్‌ని తీసుకొచ్చి, దక్షిణాది సినిమాగా లుక్ మార్చి, విడుదల చేస్తే.. మార్కెట్ ఉంటుందని భావిస్తున్నాడు. మరి ఈసారైనా ఈ సినిమా ముందుకు వెళ్తుందా, లేదంటే.. కొన్నాళ్లు ఈ సినిమాపై మాట్లాడుకుని, ఎప్పట్లా పక్కన పెట్టేస్తారా..? ఏమో.. మంచు హీరోల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు?