భారతీయ జనతాపార్టీలో నేతలంతా ఒక్కో రకంగా ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వైసీపీని పల్లెత్తు మాట అనరు. ఎవరైనా అంటే.. పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తారు. అయినా విష్ణుకుమార్ రాజు లాంటి నేతలు మాత్రం.. అలాంటి వాటిని పట్టించుకోకుండా… జగన్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా… విష్ణుకుమార్ రాజు… ముఖ్యమంత్రి పీఠాన్ని వైఎస్ భారతికి అప్పగించాలని జగన్ కు సలహా ఇచ్చారు. ఇలా సలహా ఇవ్వడానికి జగన్ జైలుకు పోతారనో.. మరో కారణమో కాదు… జగన్ సరిగ్గా పరిపాలించలేకపోతున్నారట. జగన్ సతీమణి భారతి సీఎం అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని.. ఆయన అంటున్నారు.
ఏపీకి మహిళను సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. కారణం ఏమిటో కానీ.. ఇతర బీజేపీ నేతలతో పోలిస్తే.. విష్ణుకుమార్ రాజు.. జగన్ పై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఘాటు విమర్శలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తులో బీజేపీ ఉన్నప్పుడు.. కూడా ఆయన జగన్ ను పొగిడేవారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా.. పొడిగేవారు. ఇప్పుడు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలు సాదాసీదాగా ఉండటం లేదు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో జగన్‌ను పోల్చేస్తున్నారు. జగన్‌కి ప్రజల కష్టాలు తెలియడం లేదని .. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామంటున్నారు..కానీ సీఎం కూడా మారిపోవచ్చని అంటున్నారు.
ఇటీవల విశాఖలో వారాంతాల్లో సాగుతున్న వ్యాపార కూల్చివేతలపైనా ఆయన గళమెత్తారు. శని, ఆదివారాల్లో న్యాయస్థానాల్లో పని చేస్తేనే విశాఖ వాసులకు రక్షణ ఉంటుందన్నారు. జగన్ పై ఇంత ఘాటుగా విరుచుకుపడుతున్నా… ఆ పార్టీలోని ప్రో వైసీపీ లీడర్లు మాత్రం ఆయనను కట్టడి చేయలేకపోతున్నారు. ఆయనపై టీడీపీ ముద్ర వేయలేకపోతున్నారు.