టీడీపీ, జనసేన .. తమ కూటమిలోకి బీజేపీని చేర్చుకోవాలని అనుకుంటున్నాయి. ఎందుకు చేర్చుకోవాలని అనుకుంటున్నాయో అందరికీ తెలుసు. బీజేపీ బలం ఏమిటో కూడా తెలుసు. గతంలో నోటాతో కూడా పోటీ పడలేకపోయారు. ఈ ఐదేళ్లలో బలపడిందేమీ లేదు. పురందేశ్వరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎక్కడైనా గట్టి పోటీ ఇస్తారేమో కానీ.. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా తెచ్చుకోలేరు. అంటే బీజేపీ కి బలం ఉందో.. బలహీనత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లోనూ విష్ణువర్ధన్ రెడ్డి ఆవేశపడుతున్నారు. ఆయన చేసే కామెంట్లు… అతిగా ఉంటున్నాయని బీజేపీ నేతలే మమండి పడుతున్నారు. ఓ సారి 70 అసెంబ్లీ సీట్లు కావాలంటారు.. మరోసారి తమ పార్టీ నేతే ముఖ్యమంత్రి కావాలంటారు.. ఇవన్నీ ఏదో ఓ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నారని బీజేపీలోని కొంత మంది నేతలు అంటున్నారు. ఆయన మాటలకు విలువ లేదని.. ఆయన పార్టీ తరపున మాట్లాడటం లేదని ఇతర నేతలు చెబుతున్నారు.
పొత్తులపై అసలు ఏమీ మాట్లాడవద్దని హైకమాండ్ ఎప్పుడో గట్టిగా చెప్పింది. ఎవరూ మాట్లాడటం లేదు కూడా . ఒక్క విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే ఆవేశ పడుతున్నారు. బహుశా.. టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత … పొత్తు ఇష్టం లేనందున వైసీపీలో చేరిపోయేందుకు ఆయన ఇప్పుడు స్కెచ్ వేసుకుంటున్నారన్న అనుమానాలు కూడా బీజేపీలో వ్యక్తమవుతున్నాయి. ఉరవకొండలో ఆయన పేరు ఇప్పటికే వైసీసీ సర్వే చేయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.