పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కేంద్రంగా, ఎప్పుడో సద్దు మణిగిన ఆంధ్ర తెలంగాణ గొడవలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం కెసిఆర్ ను ఎదుర్కోవడానికి జగన్ సిద్ధపడ్డాడు అంటూ ఆయన అనుంగు మీడియా, ఆయనను అభిమానించే సోషల్ మీడియా కథనాలు వండి వారుస్తుంటే, ఎన్నికైన వెంటనే విజయ సాయి రెడ్డి కెమెరాల సాక్షిగా కేసీఆర్ కాళ్లు మొక్కాడని, జగన్ కూడా కెసిఆర్ ఆమోదయోగ్యమైన రీతి లోనే పాలిస్తున్నారని, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆంధ్ర తెలంగాణ డ్రామా మొదలుపెట్టారని, కొద్ది రోజుల తర్వాత ఇద్దరు ముఖ్య మంత్రులు కలిసి పరిష్కరించుకున్నారు అనే బ్రేకింగ్ న్యూస్ తో కథ ని సుఖాంతం చేస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ బహిరంగ లేఖ రాశారు. అయితే బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి జగన్ తో కుమ్మక్కయ్యారని, ఏదో ఒకటి చేసి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి పొందాలని ఆలోచనతో ఆయన పావులు కదుపుతున్నారు అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ లేఖ రాస్తూ, ” పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ కి నీరు, అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన చర్యలను రాష్ట్రంలోని అన్ని పార్టీలు సమర్థించి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని అడ్డుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం” అని చెప్పుకొచ్చారు. అయితే, ఒక తటస్థుడిగా, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సమర్థించినట్లుగా ఈ లేఖ పైకి కనిపిస్తున్నప్పటికీ, ఈ లేఖ వెనకాల వేరు వేరు రాజకీయ సమీకరణాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆమధ్య పవన్ కళ్యాణ్ పైన విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు చేసిన సందర్భంలో, జనసేన అభిమానులు విష్ణువర్ధన్‌రెడ్డి సోషల్ మీడియా పాత ఖాతాలన్నింటిని వెలికి తీసి, ఆయన గతంలో ప్రదర్శించిన “కుల పిచ్చి” ని బయట పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీలకతీతంగా తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని ఆయన సోషల్ మీడియాలో వెనకేసుకొచ్చిన తీరు అప్పట్లో పలువురిని విస్మయానికి గురి చేసింది. కొంతమంది హీరోయిన్ ల పట్ల ఆయన వాడిన భాష కూడా వివాదాస్పదం అయింది. అయితే ఆ దెబ్బకు విష్ణువర్ధన్‌రెడ్డి కొద్ది రోజుల పాటు మీడియా ముందు కనిపించడం మానేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ లెక్కన విష్ణువర్ధన్ రెడ్డికి రాజకీయాలకు అతీతంగా, తన పార్టీ స్టాండ్ తో నిమిత్తం లేకుండా జగన్ రెడ్డి పైన ఆయన పార్టీ పైన అభిమానం ఉండటం కూడా పెద్ద ఆశ్చర్యంగా కనిపించకపోవచ్చు.
ఇదిలా ఉంటే మొన్నామధ్య వైఎస్ఆర్సిపిలో నంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కన్నా తోపాటు ఆ రొంపిలోకి పురంధరేశ్వరి ని కూడా లాగడం వెనకాల కూడా విజయ సాయి రెడ్డి వ్యూహం ఉందన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. కన్నా పై తీవ్ర ఆరోపణలు చేయడం ద్వారా ఆయనకు వచ్చేసారి అధ్యక్ష పదవి రాకుండా చేయడం, అదే విధంగా అధ్యక్ష పదవి రేసులో ఆయన తర్వాత ఉన్న పురంధరేశ్వరి మీద బురద చల్లడం ద్వారా ఆవిడకు కూడా అధ్యక్ష పదవి దక్కకుండా చేయడం, తద్వారా విష్ణువర్ధన్ రెడ్డి కి లైన్ క్లియర్ చేసే వ్యూహం విజయసాయిరెడ్డి వేశారని రాజకీయ వర్గాలలో ఆ మధ్య గుస గుసలు వినిపించాయి.
ఏది ఏమైనా బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్ష పదవి పొందడానికి విష్ణువర్ధన్ రెడ్డి, ఆ స్థానంలో ఆయనను కూర్చోబెట్టడానికి అవసరమైతే తెర వెనుక సాయం చేయడానికి విజయ సాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న గుసగుసల నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్ధిస్తూ విష్ణువర్ధన రెడ్డి రాసిన లేఖ కుమ్మక్కు రాజకీయాలకు అద్దం పడుతోంది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.