ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి .. రూ. పాతిక వేల కోట్లు అప్పు తీసుకున్న వైనం అనేక కీలక మలుపులు తిరుగుతోంది.తన పేరును ఎందుకు వాడారో చెప్పాలని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వాన్ని కోరడం ఇప్పుడు హైలెట్ అవుతోంది. ఆదివారం అయినా ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు పరుగులు పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏదో పరిష్కారం కొనుగొంటుంది. కానీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఇప్పుడే విషయం తెలిసినట్లుగా ఎందుకు హఠాత్తుగా హడావుడి చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. నిబంధనల ఉల్లంఘనపై ఎప్పటికప్పుడు టీడీపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూనే ఉంది. పయ్యావుల కేశవ్ ఈ విషయంలో స్వయంగా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ రాజ్యాంగాధినేత అని ఖచ్చితంగా వివరణ తీసుకోవాలని ఆయన మీడియాతో అన్నారు. అయితే గవర్నర్‌కు మాత్రం అవేమీ పట్టలేదు. కానీ ఇప్పుడు ఎందుకో కానీ హఠాత్తుగా లోన్లు తీసుకునే సమయంలో తన పేరు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. నిజానికి అది నిబంధనలకు విరుద్దం. ఆ పత్రం చెల్లదు. ముందుగా టెన్షన్ పడాల్సింది బ్యాంకులు. కానీ గవర్నర్ వైపు నుంచి అభ్యంతరం వచ్చింది.
ఇప్పుడే తప్పు తెలిసిందన్నట్లుగా.. గవర్నర్ వివరణ అడగడంతోనే తప్పు గుర్తించారన్నట్లుగా ఒప్పందం మార్చేందుకు బ్యాంకులతోనూ సంప్రదింపులు ప్రారంభించారు. ఇదంతా ఓ పద్దతి ప్రకారం జరుగుతోందన్న అభిప్రాయం విపక్ష పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల న్యాయస్థానం కూడా గవర్నర్ పేరున రుణం ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. రాజ్ భవన్ నుంచి వెళ్లిన లేఖ కూడా ప్రభుత్వ వ్యూహమేనని భావిస్తున్నారు.
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాజ్యాంగాధినేత అయిన గవర్నర్‌కు.. ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ తన సమస్యలు చెప్పుకుంటే ఆ లేఖలన్నీ ప్రభుత్వానికి చేరేవి. అత్యంత కాన్ఫిడెన్షియల్ అయినా కూడా చేరేవి. వాటిని పట్టుకుని ఆయనపై చర్యలు తీసుకుంటామని మంత్రులు చెలరేగిపోయారు.తన లేఖలు రాజ్ భవన్ నుంచి లీక్ కావడంతో కోర్టుకు కూడా వెళ్లారు నిమ్మగడ్డ. ఇప్పుడుకూడా సమస్యలు సృష్టించడం.. పరిష్కరించడంలో రాజ్ భవన్‌ను ఓ పావుగా ప్రభుత్వం వాడుకుంటోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.