ఓ హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా ఎవరైనా చేస్తారు. ఫ్లాప్ ఇచ్చినా కూడా ‘నేనున్నా’ అంటూ ధైర్యం చెప్పే హీరోలు చాలా అరుదు. విశ్వక్సేన్ని ఈ జాబితాలో చేర్చేయొచ్చు. కృష్ణ చైతన్యతో కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చేశాడు విశ్వక్. అయితే ఈ సినిమా ఫ్లాప్. ఇలాంటి పరాజయం తరవాత మళ్లీ అదే దర్శకుడితో కలిసి సినిమా చేయడానికి ఏ హీరోకైనా గట్స్ ఉండాలి. ఆ మాటకొస్తే కృష్ణ చైతన్యకే మరో ఛాన్స్ ఎవరైనా ఇస్తారా, దర్శకుడిగా తన భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తాయి. దర్శకుడిగా కృష్ణ చైతన్య తలుపులు పూర్తిగా మూసుకుపోయాయేమో అనిపించింది. అయితే విశ్వక్ అనూహ్యంగా కృష్ణ చైతన్యకు మరో ఛాన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు.
ఔను.. విశ్వక్ – కృష్ణ చైతన్య మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. గతంలో నితిన్ కోసం రాసుకొన్న ‘పవర్ పేట’ స్క్రిప్టునే ఇప్పుడు విశ్వక్తో తెరకెక్కించబోతున్నాడట కృష్ణ చైతన్య. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చేస్తున్నప్పుడే కృష్ణ చైతన్యకు విశ్వక్సేన్ మాట ఇచ్చాడు. ‘ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే, నీతో మరో సినిమా చేస్తా’ అని ప్రామిస్ చేశాడట. కేవలం ఆ మాట మీద నిలబడి విశ్వక్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడితో రాపో కోసమో, సినిమా విడుదలైన తరవాత ప్రమోషన్ల కోసమో హీరోలు చాలా మాటలే ఇచ్చేస్తారు. కానీ దాని మీద నిలబడడం నిజంగా గ్రేట్. నితిన్ తో ముందుకు సాగలేని ‘పవర్ పేట’ కథని తెరపై చూసుకొనే ఛాన్స్ కృష్ణ చైతన్యకు మరోసారి దక్కింది. మరి.. ఈసారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటాడో లేదో చూడాలి. విశ్వక్ ‘లైలా’ ఇటీవలే పట్టాలెక్కింది. ఆ సినిమాతో పాటే సమాంతరంగా ‘పవర్ పేట’ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.