యంగ్ హీరోలు ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేయాల్సిందే. ఈ విషయంలో అంతా విశ్వక్సేన్ని ఆదర్శంగా తీసుకొంటే మంచిది. ఇటీవలే.. ‘మెకానిక్ రాఖీ’గా వచ్చాడు విశ్వక్. అంతలోనే ‘లైలా’ సిద్ధం చేశాడు. ఈ సినిమాకు కొబ్బరి కాయ కొట్టేటప్పుడే `ఫిబ్రవరి 14న వస్తున్నాం` అని ప్రకటిచింది టీమ్. మాట ఇచ్చినట్టే ఫిబ్రవరి 14న సినిమాకు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ తో తెలుగు 360 ప్రత్యేకంగా ముచ్చటించింది. అందులో కొన్ని హైలెట్స్.
* దర్శకుడు ఈ కథ చెబుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నా. సినిమా చూసిన ప్రేక్షకుల పరిస్థితీ అంతే. పూర్తి వినోదాత్మక సినిమా ఇది. ఏం చేసినా నవ్వించడానికే చేశాం.
* లేడీ గెటప్ వేయడం పెద్దగా రిస్క్ అనుకోను. నేను కూడా చాలాకాలంగా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూశా. మాటి మాటికీ గెడ్డం గీక్కోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అంతకు మించి బాధలేం పడలేదు.
* ఇది వరకు చాలామంది హీరోలు లేడీ గెటప్పులు వేశారు. ఈ కథ ఒప్పుకొన్నాక రిఫరెన్స్ కోసం ఎలాంటి సినిమాలూ చూడలేదు. చూస్తే ఆ ప్రభావం నాపై పడుతుందేమో అన్న భయం.. అంతే. లేడీ గెటప్పులు వేసిన హీరోల్లో కమల్ హాసన్ అంటే ఇష్టం. ఆయన భామనే సత్యభామనే చిన్నప్పుడెప్పుడో చూశా.
* విక్రమ్, కమల్ హాసన్ లాంటి హీరోలు ఒక్కో సినిమాలో నాలుగైదు గెటప్పులు వేస్తుంటారు. అందుకోసం వాళ్లెంత కష్టపడతారన్న విషయం లైలాతో అర్థమైంది. కాకపోతే.. ఇప్పుడు జనరేషన్ మారింది. గెటప్పులు ఎక్కువ వేసినా బోర్ కొట్టేస్తుంది.
* బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు రాగానే ఫోన్ చేసి అభినందించా. పార్టీకి వెళ్లలేదు. అక్కడ చాలామంది పెద్దవాళ్లు వస్తారు. సెక్యురిటీ గట్టిగా ఉంటుంది. వాళ్లు గెంటేస్తారేమో అని భయపడ్డా.
* బాలయ్యతో సినిమా చేయాలని వుంది. చేస్తే ఆషామాషీగా ఉండకూడదు.
* ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకొంటూ వెళ్లడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఓ సినిమా సెట్స్‌పై ఉందంటే దానిపై ఆధారపడి చాలామంది బతుకుతుంటారు. ఫ్లాప్ సినిమా కూడా చాలామందికి అన్నం పెడుతుంది.
* అనుదీప్ తో ఓ సినిమా చేస్తున్నా. అది అల్లరి అల్లరిగా ఉంటుంది.
– పూర్తి ఇంటర్వ్యూ కోసం.. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి