విశ్వక్ సేన్ ఆశలన్నీ ‘లైలా’పైనే ఉన్నాయి. ఎందుకంటే తనకు ఈమధ్య కాస్త గట్టి దెబ్బలే తగిలాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ బాక్సాఫీసు దగ్గర పల్టీకొట్టింది. ఆ తరవాత ‘మెకానిక్ రాకీ’ కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. తన చేతిలో సినిమాలైతే ఉన్నాయి. కానీ ఓ హిట్ చాలా అవసరం. అలాంటి దశలో ‘లైలా’ వస్తోంది. విశ్వక్‌ని లేడీ గెటప్ లో చూపించే సినిమా ఇది. అదే.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఫృథ్వీ రాజేసిన వివాదం వల్ల.. ఈ సినిమా పేరు ఇంకాస్త నలిగింది. ఇప్పుడు బాక్సాఫీసు ముందుకు రావడమే బాకీ.
ఇటీవలే సినిమా సెన్సార్ పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్ టైమ్ చాలా షార్ప్‌గా ఉంది. 2 గంటల 16 నిమిషాల నిడివి ఫిక్స్ చేశారు. అంటే.. కాస్త తొందరగా ముగిసే సినిమా అన్నమాట. ఈమధ్య సినిమాలు లెంగ్తీగా ఉంటే ఇష్టపపడం లేదు. ఎంత షార్ప్‌గా కట్ చేస్తే అంత మంచిది. సోనూ లైలాగా మారే ఎపిసోడ్ నుంచి ఫన్ రైడ్ మొదలవుతుందని, సెకండాఫ్ హిలేరియస్ గా సాగిపోయిందని, విశ్వక్సేన్ లైలాగా చేసిన విన్యాసాలే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చిత్రబృందం చెబుతోంది.
హీరోలు లేడీ గెటప్ వేసిన సినిమాలు చాలా వరకూ సక్సెస్ అయ్యాయి. ఈ జోనర్‌కు మినిమం గ్యారెంటీ ఉంది. అందుకే విశ్వక్ కూడా ఈ సినిమాతో సక్సెస్ కొడతానన్న నమ్మకాన్ని కనబరుస్తున్నాడు. 14న ‘లైలా’ విడుదల అవుతోంది. సాధారణంగా విశ్వక్సేన్ సినిమా అంటే ప్రీమియర్ల హడావుడి ఉంటుంది. ఈ సినిమాకు మాత్రం ప్రీమియర్లు లేవని తెలుస్తోంది. ‘లైలా’ జాతకం శుక్రవారమే తేలాలిక.