కరోనా కొన్ని కొత్త కథలు తెచ్చింది. కరోనా నేపథ్యంలోనూ దర్శకులు కథలు రాసుకోవడం మొదలెట్టారు. అవన్నీ ఇప్పుడు ఒకొక్కటిగా వస్తున్నాయి. రేపు (శుక్రవారం) విడుదల కాబోతున్న వివాహ భోజనంబు… లాక్ డౌన్ కథ. మంచి రోజులొచ్చాయి, WWW.. వీటికి కరోనాతో లింకు ఉంది. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా అలాంటి కథే చేస్తున్నాడు. విశ్వక్ నటిస్తున్న కొత్త సినిమా.. అశోక వనంలో అర్జున కల్యాణం. ఎస్వీసీసీ సంస్థ నిర్మిస్తోంది. విద్యాసాగర్ చింతా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇది కూడా లాక్ డౌన్ కథే. ఓ అబ్బాయి… అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్తాడు. సరిగ్గా అదే రోజు.. లాక్ డౌన్ ప్రకటిస్తారు. దాంతో.. అబ్బాయి కుటుంబం మొత్తం.. అమ్మాయి ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ తరవాత ఏం జరిగిందన్నదే కథ. సినిమా దాదాపుగా ఒకే ఇంట్లో జరుగుతుందట. అందుకోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ సెట్ కూడా వేశారు. ఈ సినిమాపై.. చిరునవ్వుతో, పరుగు లాంటి కథల ప్రభావం ఉందని, ఆయా సినిమాల్లో చర్చించిన పాయింట్లు… ఇందులోనూ ఉంటాయని, అయితే వాటిని కొత్త తరహాలో చూపించబోతున్నారని సమాచారం. విశ్వక్ ఇప్పటి వరకూ మాస్, యూత్ కథలు చేశాడు. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవుతాడని, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.