విశ్వక్సేన్ తెలంగాణ బిడ్డ. తన యాస, భాషలో తెలంగాణ జీవం ఉట్టిపడుతుంటుంది. తను గోదావరి యాసలోకి దిగిపోతే ఎలా ఉంటుందో తెలియాలంటే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూడాలి. విశ్వక్సేన్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. దీనికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పేరు ఖరారు చేశారు. ఈరోజు ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదలైంది. ”అన్నాయ్.. మేము గోదారోళ్లం. మాటొక్కటే సాగదీస్తాం. తేడా వస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం” అనే డైలాగ్ ఈ గ్లింప్స్‌లో వినిపించింది. ఆ డైలాగ్‌లోనే.. ఈ కథలోని డెప్త్ అర్థమవుతోంది. 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో గోదావరి, అక్కడి రాజకీయాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో కథ నడుస్తుంది. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. నేహా శెట్టి కథానాయిక. గ్లింప్స్ ఆసక్తికరంగానే అనిపించింది. విశ్వక్సేన్ని ఓ సరికొత్త అవతార్ లో చూడబోతున్నామన్న భరోసా కలిగించింది. గీత రచయితగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన కృష్ణ చైతన్య రౌడీ ఫెలో, ఛల్ మోహన రంగ లాంటి సినిమాలు తీశాడు. రెండూ ఫ్లాపులే. ఇది హ్యాట్రిక్ ప్రయత్నం. మరి ఈసారి ఏం అవుతుందో చూడాలి.