అతని పేరు ప్రేమ్. పేరుని సార్థకం చేసుకోవాలనుకున్నాడేమో… ఏకంగా పదహారొందలమంది అమ్మాయిల్ని ప్రేమించాడు. శ్రీకృష్ణుడిలా. ఆ వీధిలోకి వెళ్లి గీత ఇల్లెక్కడ? అని అడిగితే… కుప్పిలి గీత, బెక్కం గీత, బెజవాడ గీత, మార్వాడీ గీత, టెన్త్ ఫెయిల్ అయిన గీత, టెన్త్ పాస్ అయిన గీత, పబ్ జీ ఆడిన గీత, లూడో ఆడే గీత, క్వాండీ క్రష్ ఆడే గీత.. ఇలా చాలామంది గీతలున్నారు. వాళ్లలో ఏ గీత కావాలి` అంటూ గీతాసారాన్ని బోధించేంత విషయ పరిజ్ఞానం ఉన్న ప్రేమికుడు తను. ఊర్లో ఏ అమ్మాయి కనిపించినా ఐ లవ్ యూ చెబుతాడు. తను ప్రేమించడానికి పర్సనాలిటీ అవసరం లేదు. అమ్మాయైతే చాలు. అందుకే కనిపించిన ప్రతీ అమ్మాయి చేతిలో పువ్వు పెట్టి, ప్రేమించు అని అర్థిస్తాడు. అలా పదహారొందల మంది అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పాక.. ఓ అసలైన ఆడ ఆణిముత్యం తగిలింది. ఆ తరవాత ఏమైందో తెలియాలంటే… `పాగల్` చూడాలి.
విశ్వక్ సేన్ – నివేదా పేతురాజ్ జంటగా నటించిన చిత్రమిది. బెక్కం వేణు గోపాల్ నిర్మాత. ఈనెల 13న విడుదల అవుతోంది. పాగల్.. ట్రైలర్ కి తగ్గట్టు ఇదో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగబోతోంది. విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్, తన ప్రెండ్ సర్కిల్, వాళ్ల సర్కిల్.. వీటితోనే బోల్డంత ఫన్ కురిసే అవకాశం ఉంది. థియేటర్లలో కుర్రాళ్లు ఎంజాయ్ చేసి చాలా కాలమైంది. ఆ లోటుని.. పాగల్ తీర్చేలా కనిపిస్తోంది. విశ్వక్ లుక్ బాగుంది. నివేదా కూడా రొమాంటిక్ గా కనిపిస్తోంది. ఈ జంట.. కచ్చితంగా మనసుల్ని గెలుచుకునేలా ఉంది. సెకండ్ వేవ్ తరవాత ఇప్పుడిప్పుడే పరిశ్రమ కాస్త గాడిలో పడుతోంది. పాగల్ హిట్ అయితే.. ఇంకాస్త హుషారొస్తుంది.