మొన్నటి వరకూ ‘వెబ్ సైట్ రివ్యూలు’ సినిమాని దెబ్బ కొడుతున్నాయని దర్శక నిర్మాతలు వాపోయేవారు. ఇప్పుడు బుక్ మై షో ఇచ్చే రేటింగులూ తమ చిత్రాలకు శాపంగా మారుతున్నాయని బెంగ పెట్టుకొంటున్నారు. పైగా ఫేక్ రేటింగులతో ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. బుక్ మై షోలో.. రేటింగుల సిస్టమ్ ఉంది. అక్కడ నేరుగా ప్రేక్షకులే.. రేటింగులు ఇవ్వొచ్చు. పదికి గానూ ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకొంటే అంత మంచి సినిమా అన్నట్టు లెక్క. అయితే ఇక్కడ ఫేక్‌ల గోల ఎక్కువైంది. కొంతమంది కావాలనే ఫేక్ ఓట్లు వేసి, తమ సినిమాలకు రేటింగులు రాకుండా అడ్డుకొంటున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయి.
సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’ విషయంలో ఇదే జరిగింది. బుక్ మై షోలో ఫేక్ రేటింగులు ఇచ్చి, సినిమాని డామేజ్ చేస్తున్నారని సైబర్ క్రైమ్కీ, అలానే బుక్ మై షో నిర్వాహకులకూ ఫిర్యాదు చేసింది చిత్రబృందం. ఇప్పుడు ‘గామి’ విషయంలోనూ అదే జరుగుతోంది. గామికి బుక్ మై షోలో ఒకటి, రెండు రేటింగులు ఇస్తున్నారు. దాంతో బుక్ మై షోలో.. గామి రేటింగు దారుణంగా పడిపోయింది. నిజానికి… గామి చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు 9 రేటింగులు రావడడం సహజం. కానీ బుక్ మై షోలో ‘గామి’ రేటింగులు 2, 3 మాత్రమే కనిపిస్తున్నాయి. దీనిపై విశ్వక్సేన్ కూడా స్పందించాడు. తమ సినిమాని కావాలని తొక్కేస్తున్నారని, ఫేక్ రివ్యూలు ఇస్తున్నారని, దీనిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకొంటామని, తమని ఎంతగా తొక్కేస్తే అంతగా పైకి లేస్తామని తాను విడుదల చేసిన ఓ ప్రత్యేకమైన నోట్లో రాసుకొచ్చాడు విశ్వక్. ఎవరు ఎంతలా దెబ్బకొట్టాలని చూసినా, ప్రేక్షకులు తమ సినిమాని ఆశీర్వదించారని, అదే తమకు బలమని విశ్వక్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి బుక్ మై షోలో ఫేక్ రేటింగుల గోల `గామి`తో మళ్లీ బయటపడింది. దీనిపై బుక్ మై షో నిర్వాహకులే స్పందించాలి.