హిట్లొచ్చినప్పుడు పొగడ్తలు వస్తాయి. వాటిని ఎంత ఆనందంగా స్వీకరిస్తారో, ఫ్లాప్ ఇచ్చినప్పుడు ఎదురైన విమర్శల్నీ అంతే హుందాగా తీసుకోవాలి. ఈ విషయంలో ఈతరం ఎందుకో వెనుకబడి ఉంది. ముఖ్యంగా రివ్యూవర్లపై ఫైర్ అయ్యే వర్గమే ఎక్కువ. విమర్శల్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. విశ్వక్సేన్ కూడా నిన్నా మొన్నటి వరకూ ఇలానే ఉన్నాడు. ఎవరైనా ఓ మాట అంటే – వెంటనే కౌంటర్ వేసేసేవాడు. ఫ్లాప్ సినిమాల్ని కూడా వీలైనంత లాగే ప్రయత్నం చేసేవాడు. అయితే ‘లైలా’ విషయంలో తాను కామ్ అయిపోయాడు. ఇటీవల విడుదలైన ‘లైలా’.. విమర్శల పాలైంది. ఇది యూత్ సినిమానా, బూతు సినిమానా? అని విమర్శించిన వాళ్లెక్కువ. సినిమా విడుదలై, ఇన్ని రోజులైనా.. వస్తున్న విమర్శలపై విశ్వక్ స్పందించలేదు. ఇప్పుడు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు.
ఇటీవల తన నుంచి వచ్చిన సినిమాలు నిరుత్సాహపరిచాయని, ఇక మీదట అందరికీ నచ్చే సినిమాలు తీస్తానని మాట ఇచ్చాడు. తనకు ఇంతకాలం అండగా ఉన్న నిర్మాతలకు, పంపిణీదారులకు, ముఖ్యంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇటీవల విడుదలైన ‘లైలా’లో అసభ్యత, ద్వందార్థాలూ కనిపించాయి, వినిపించాయి. దానిపై కూడా వివరణ ఇచ్చాడు. ఇక మీదట అలాంటి అంశాలకు తావు లేకుండా చూసుకొంటానని హామీ ఇచ్చాడు. ఓ చెత్త సినిమా తీస్తే విమర్శించే హక్కు.. అందరికీ ఉంటుందని, ముఖ్యంగా తన వెనుక ఏమీ లేనప్పుడు అండగా ఉన్నవాళ్లందరికీ ఉంటుందని, విమర్శని తాను స్వీకరిస్తానని హుందాగా చెప్పుకొచ్చాడు విశ్వక్. త్వరలోనే మరో బలమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
విశ్వక్లో దూకుడు ఎక్కువ. తేడా వస్తే ఫటాఫట్ మని తేల్చేశాడు. విమర్శలకు అంత తేలిగ్గా లొంగే రకం కాదు. అయితే ‘లైలా’పై చాలా గలాటా జరిగింది. విశ్వక్ అభిమానులు కూడా `ఇదేం సినిమారా బాబూ` అని తలలు పట్టుకొన్నారు. తన తప్పు గ్రహించిన విశ్వక్.. ఏమాత్రం సంకోచించకుండా, ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఆహ్వానించదగిన పరిణామమే. తప్పులు అందరూ చేస్తారు. కానీ వాటిని గ్రహించడం, పాత తప్పులు పునరావృతం చేయకూడదని నిర్ణయించుకోవడం మంచి విషయాలు. ఇప్పుడు విశ్వక్ అదే చేశాడు.