విశ్వక్ సేన్ కి ‘మాస్ కా దాస్’ అనే ట్యాగ్ వుంది. ఆయన ఫలక్నుమా దాస్ సినిమా చేశాడు. అందులో ఆయన పాత్రకి కాస్త మాస్ టచ్ వుంటుంది. దీంతో అందులో దాస్ కి మాస్ తగిలించి ఇక అదే బిరుదుగా కొనసాగిస్తున్నారు. ఆ సినిమా తప్పితే (అది కూడా ఒరిజినల్ కాదు. మలయాళ చిత్రం అంగమలీ డైరీస్ కి రీమేక్) విశ్వక్ మాస్ టచ్ తో చేసిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకులని అలరించలేకపోయింది. బాక్సాఫీసు ముందు నిలబడలేకపోయింది. పాగల్, దాస్ కా ధమ్కి, గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మెకానిక్ రాకీ తేలిపోయాయి. తాజాగా విడుదలైన లైలా గురించి ఈ లిస్టు లో ప్రస్థావించకూడదు. దాన్ని సినిమా అనడానికి కూడా చాలా మందికి ఇప్పుడు మనసు రావడం లేదు.
అదలావుంచితే.. విశ్వక్ తో ఆడియన్స్ కి కనెక్షన్ ఏర్పడింది తనలోని ఒరిజినాలిటీ చూసి. తను ఎంతో క్యాజువల్ గా చెప్పిన ”నాగుల పంచమి’ అనే ఒక్క డైలాగ్ ఒక జనరేషన్ యూత్ కి గుర్తుండిపోయేలా చేసింది. ఆఫ్ కోర్స్ అందులో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మార్క్ కూడా వుంది. అయితే విశ్వక్ ఈ ఫాలోయింగ్ ని ‘మాస్’ ఇమేజ్ వైపు తిప్పారు. డ్యాన్సులు, ఫైట్లు, కమర్షియల్ ఫీట్లు చేయగల నటుడు తనలో కూడా ఉన్నాడని నిరూపించేకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం మంచిదే. ప్రతి నటుడికి మాస్ మూల విరాట్ అవ్వాలనే వుంటుంది. కానీ ఈ ప్రక్రియ సహజంగా జరిగతే మంచి.
కానీ విశ్వక్ కథల ఎంపిక అలా వుండటం లేదు. వాంటెడ్ గా మాస్ ని మెస్మరైజ్ చేసేయాలనే ప్రయత్నం దెబ్బకొడుతోంది. విశ్వక్ కెరీర్ ని గమనిస్తే.. ఈనగరానికి, ఫలక్ నుమా, హిట్, గామి, అశోక వనంలో చిత్రాలే కళ్ళముందు కదులుతాయి. మిగతావన్నీ మాస్ విఫలయత్నాలే. కొన్నాళ్ళుగా అయితే విశ్వక్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ బ్లాంక్ అయిపోతున్నారు. కారణం.. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు వున్న ఓ మామూలు రొటీన్ మాస్ సినిమా విశ్వక్ లాంటి నటుడు చేయడం ప్రేక్షకులకే అంతు చిక్కడం లేదు. నిజానికి అలాంటి సినిమాలు చేయడానికి విశ్వక్ లాంటి నటుడు అవసరం లేదు. బోలెడుమంది హీరోలు చేస్తున్నారు.
విశ్వక్ లో ఓ స్పెషాలిటీ చూసి ఆయన్ని ఇష్టపడ్డారు ఆడియన్స్. ఆ స్పెషాలిటీ మాత్రం ఇప్పుడు విశ్వక్ చేస్తున్న సినిమాల్లో లేదు. రీసెంట్ లైలా చూసిన తర్వాత ఆడియన్స్ పై ఆయనకి ఓ చులకన భావం కూడా కనిపించింది. ఈ ధోరణి ఆయన కెరీర్ కి మంచి కాదు. ఈ మాస్ మూస నుంచి బయటపడి మళ్ళీ న్యూ ఏజ్ కంటెంట్, ఆథర్ బ్యాక్డ్ రోల్స్ పై దృష్టిపెడితే ప్రోత్సహించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే.