విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘లైలా’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆ తరవాత ‘బందూక్’ అనే ఓ చిత్రాన్ని పట్టాలెక్కించాల్సింది. దీనికి సుధాకర్ చెరుకూరి నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ జరిగిపోయాయి. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకొన్నట్టు వార్తలొస్తున్నాయి. కాకపోతే.. ప్రాజెక్ట్ ఇంకా ఆన్ లోనే ఉంది. ఈ కథ ఇప్పుడు రవితేజ చేతికి చిక్కిందని తెలుస్తోంది. రవితేజతో దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారని, వారం పది రోజుల్లో ఈ ప్రాజెక్టుపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
విచిత్రం ఏమిటంటే.. అసలు ఈ కథ రవితేజని దృష్టిలో ఉంచుకొని రాసిందే. కానీ.. విశ్వక్ దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రవితేజ చేతికి చిక్కింది. రవితేజ ‘మాస్ జాతర’ తుది మెరుగుల్లో వుంది. ఈ సినిమా తరవాత రవితేజ `బందూక్`ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. రవితేజ తన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతతో తర్జన భర్జనలు పడుతున్నాడని, అది ఓకే అయితే.. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని సమాచారం అందుతోంది. ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకూ అందుకొంటున్నాడు మాస్ మహారాజా. ఈ సినిమాకూ అదే పారితోషికం ఫిక్స్ అని ఇన్ సైడ్ వర్గాల టాక్.