హీరోలు లేడి గెటప్పులు వేయడం కొత్త కాదు. కథలో భాగంగా ఇతర పాత్రలను మభ్యపెట్టేందుకు నటులు అప్పుడప్పుడు ఇలా అమ్మాయిలుగా మారిపోతుంటారు. తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందేమోనని భయంలోనే బోలెడు వినోదం పండుతుంటుంది. హాస్యనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాంటి రోల్స్ ప్లే చేయడం సాధారణమే. అయితే హీరోలు కూడా ఈ సాహసం చేశారు. ‘చంటబ్బాయ్’ సినిమాలోని ‘నేనో ప్రేమ పూజారి’ పాటలో లేడి గెటప్ కనిపించారు చిరంజీవి. ‘పాండురంగడు’ లో నందమూరి బాలకృష్ణ కొన్ని సెకన్లపాటు అమ్మాయి పాత్రలోకి ప్రవేశిస్తారు. ‘టాప్‌హీరో’ చిత్రంలోనూ ఓ లేడి గెటప్ వుంది. ‘బాడీగార్డ్’ సినిమాలో వెంకటేశ్, ‘గంగోత్రి’ అల్లు అర్జున్, ‘కితకితలు’లో అల్లరి నరేశ్ లేడి గెటప్స్ లో అలరించారు.
అయితే లేడీ గెటప్పుల్లో ఫుల్త్ లెంత్ రోల్స్ చేసిన ఆకట్టుకున్న వారిలో కమల్ హసన్, నరేష్ వికే, రాజేంద్రప్రసాద్ గురించి చెప్పుకోవాలి. ‘చిత్రం భళారే విచిత్రం’ లో నరేశ్ గెటప్ అదిరిపోతుంది. ‘మేడమ్’లో రాజేంద్ర ప్రసాద్ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక గెటప్పులకు మారుపేరైన కమల్ హాసన్ భామనే సత్యభామనే సినిమా అయితే లేడి గెటప్పుల్లో ఓ ట్రెండ్ సెట్టర్. శివకార్తికేయన్ చేసిన రెమో లేడి గెటప్ కూడా ఆకట్టుకుంటుంది.
ఇప్పుడు విశ్వక్ సేన్ లైలా సినిమాలో లేడి గెటప్ లో కనిపిస్తున్నారు. ఇది ఫుల్ లెంత్ కామెడీ సినిమాని టీం చెబుతోంది. విశ్వక్ లేడి గెటప్ ఇందులో ప్రత్యేకం. మాస్ ఇమేజ్ ఉన్న హీరో విశ్వక్. తను లేడిగా మారడం ఆసక్తికరమే. టీజర్, ట్రైలర్ లో తన లేడి గెటప్ బాగానే వుంది కానీ మరీ అంత నాజూకుదనం లేదు. స్వయంగా చిరంజీవి అన్నట్టు.. మాంచి ప్రౌడ, కసక్ అనిపించేలా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ అంతా లైలా గెటప్ మీదే ఆధారపడి వుంది. ఆ పాత్ర పండితేనే కామెడీ పండుతుంది.
ఇలాంటి రోల్ చేయడం ఏ నటుడికైన ఒక సవాలే. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా అందుబాటులోకి వచ్చింది. ఏఐ అద్భుతాలు చేస్తోంది. ఒక ఫోటో ఇచ్చిన దాన్ని లేడి గెటప్ లోకి మార్చమంటే వందల వెర్షన్స్ ఇస్తోంది. దాని నుంచి ఒకటి పిక్ చేసుకొని ఆ రకంగా మేకప్ చేసుకునే వెసులుబాటు వుంది. అలాగే కెమరాల్లో కూడా చాలా ట్రిక్కులు అందుబాటులో ఉన్నాయి. ముఖాన్ని కావాల్సినంత నాజుగ్గా మార్చుకునే వీలు సీజీలో వుంది. అలాగే వాయిస్ ని కూడా ఫీమేల్ వాయిస్ గా కన్వర్ట్ చేసే టూల్స్ వున్నాయి. మరి ఇప్పుడు అందుబాటులో వున్న టెక్నాలజీని లైలా టీం ఎంతవరకు వాడుకుందో చూడాలి. ఏదేమైనా కథ, పాత్ర చిత్రీకరణ సహజత్వం వుంటేనే నవ్వులు పూస్తున్న రోజులివి. మరి ఈ విషయంలో లైలా ఎలాంటి వినోదాన్ని పంచుతుందో తెలియాలంటే ఫెబ్రవరి 14 వరకు ఆగితే సరిపోతుంది.