నిర్మాతగానూ నాని తన అభిరుచిని చూపిస్తున్నాడు. తన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై వచ్చిన `అ..` మంచి ప్రయత్నంగా మిగిలింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన బ్యానర్లో రెండో సినిమాని పట్టాలెక్కించడమే కాదు, ఫిబ్రవరి 28న విడుదల చేసేస్తున్నాడు కూడా. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రుహానీ శర్మ కథానాయిక. శౌలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 1 సందర్భంగా టీజర్ విడుదలైంది.
ఇందులో విశ్వక్ ఓ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. తన ఉద్యోగ పయనంలో తనకు ఎదురైన మొదటి కేసు అది. ఆ ప్రయాణంలో తనకు ఎదురైన ప్రమాదాలేంటి? ఆ కేసుని ఎలా ఛేదించాడు? అనే విషయాల నేపథ్యంగా ఈ సినిమా సాగబోతోంది. టీజర్ లో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. హీరో ఫ్లాష్ బ్యాక్కీ,తాను ఎదుర్కున్న తొలి కేసుకీ ఓ లింకు ఉన్న సంగతి టీజర్‌లోని డైలాగుతో అర్థం అవుతోంది. సీరియస్ లుక్స్‌లో విశ్వక్ ఆకట్టుకుంటున్నాడు. నేపథ్య సంగీతమూ బాగుంది. టీజర్‌లోని షాట్సన్నీ నైట్ ఎఫెక్ట్ లోనే కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి ఇదంతా ఓ రాత్రి జరిగిన కథలా అనిపిస్తోంది.