పాటల రచయితగా గుర్తింపు తెచ్చుకొన్న కృష్ణ చైతన్య ఆ తరవాత మెగా ఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. రౌడీ ఫెలో, ఛల్ మోహన రంగ చిత్రాలతో దర్శకుడిగా మారాడు. కానీ విజయాలు వరించలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విశ్వక్సేన్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. దీనికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్ ఖరారు చేశారు. 1980… ఆ ప్రాంతంలో గోదావరి నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడి గ్యాంగ్ వార్స్, ముఠా తగాదాలు, రౌడీయిజం ఎలా ఉండేవి? అనే పాయింట్ చుట్టూ ఈ కథని అల్లారు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి కథానాయిక. యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ముందు నుంచీ త్రివిక్రమ్ సలహాలూ, సూచనలూ, సపోర్ట్ తోనే సినిమాలు చేస్తున్నాడు కృష్ణ చైతన్య. ఈ సినిమాలోనూ ఆయన భాగస్వామ్యం ఉందని టాక్. నిజానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో చేయాల్సిన సినిమా ఇది. అప్పట్లో శర్వానంద్ ని కథానాయకుడిగా అనుకొన్నారు. ఆ తరవాత విశ్వక్ చేతికి వచ్చింది.