‘విశ్వంభర’ నుంచి తొలి పాట బయటకు వచ్చింది. ‘రామ.. రామ’ అంటూ సాగే ఈ పాటని హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. కీరవాణి ట్యూన్ బాగుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటని చక్కటి పదాలతో రాశారు. పాటలో కొన్ని విజువల్స్ లిరికల్ వీడియోలో కనిపించాయి. చిరు లుక్ బాగుంది. శోభి మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాటకు అక్షరాలా రూ.6 కోట్లు ఖర్చయ్యాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ పాట కోసం 4 భారీ సెట్లు వేశారు. 400 మంది డాన్సర్లు, 400 మంది జూనియర్లు, 15 మంది నటీనటులు ఈ పాటలో కనిపిస్తారు. దాదాపు 12 రోజుల పాటు షూట్ చేశారని తెలుస్తోంది. లిరికల్ వీడియోలో ఈ పాట మేకింగ్ క్వాలిటీ బాగానే కనిపించింది. సినిమాలో ఈపాట మరింత కలర్ ఫుల్ గా ఉంటుందని, సెట్ వర్క్ మెస్మరైజ్ చేయబోతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జులై 24న ఈ సినిమాని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మే నుంచి మిగిలిన పాటలన్నీ ఒకొక్కటిగా విడుదల చేస్తారు. ఒక పాట మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ పాటని కూడా చాలా భారీ స్థాయిలో తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇది ఐటెమ్ పాట. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ కనిపించబోతోంది. ఆ హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కీరవాణి ఇది వరకే ఐటెమ్ పాటకు సంబంధించిన ట్యూన్ రెడీ చేశారు. అయితే ఇప్పుడు ఆ ట్యూన్ పక్కన పెట్టి, కొత్త పాట కంపోజ్ చేస్తున్నార్ట. ఆ పాట మాస్కి బాగా నచ్చుతుందని, ఈ ఆల్బమ్ మొత్తానికే ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని టీమ్ ధీమాగా వుంది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.