జనవరి 10న రావాల్సిన సినిమా ‘విశ్వంభర’. కానీ ‘గేమ్ ఛేంజర్’ వల్ల సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. సంక్రాంతికి రాకపోయినా, ఫిబ్రవరిలోనో, మార్చిలోనో వచ్చేస్తుందిలే అని ఫ్యాన్స్ భావించారు. కానీ… ‘విశ్వంభర’ మరింత ఆలశ్యం అవుతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకొన్నారని తెలుస్తోంది.
మే 9కి ఓ ప్రత్యేకత ఉంది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలైంది ఆరోజే. భారీ వర్షాలు, వరదల్లో కూడా చిరు సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ డేట్ అశ్వనీదత్ కూ సెంటిమెంటే. ‘మహానటి’ సినిమాని ఇదే రోజున విడుదల చేశారు. ఇప్పుడు… ‘విశ్వంభర’కు ఇంతకు మించిన డేట్ దొరకదని చిరంజీవి భావిస్తున్నారు.
‘విశ్వంభర’ సినిమా మొదలైన రోజుల్లో వైజయంతీ మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ రీమేక్ రైట్స్ తమ దగ్గరే ఉన్నాయని, ఎవరికీ ఇవ్వలేదని, ఈ సినిమా కాన్సెప్ట్ ని ఏ రూపంలో కాపీ కొట్టినా చర్యలు తీసుకొంటామని స్పష్టం చేసింది. ‘విశ్వంభర’ సినిమాకూ, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కథకూ ఎక్కడో కనెక్షన్ ఉందని, అందుకే వైజయంతీ మూవీస్ ఇలాంటి ప్రకటన విడుదల చేసిందని చిత్రసీమలో హాట్ టాపిక్ నడిచింది. ఇప్పుడు పోయి పోయి, జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ డేట్ నే ‘విశ్వంభర’ని విడుదల చేస్తున్నారు. ఇది కో ఇన్సిడెన్స్ అనుకోవాలా? లేదంటే నిజంగానే రెండు సినిమాలకూ లింక్ ఉందా? అనే మరో ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ లో మొదలవ్వడం ఖాయం. ఇప్పడు అశ్వనీదత్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.