సంక్రాంతికి రావాల్సిన సినిమా ‘విశ్వంభర’. ఇప్పుడు 2025 వేసవికి వాయిదా పడింది. మే 9న గానీ, విశ్వంభర విడుదల కాదన్నది తేలిపోయింది. విశ్వంభర వాయిదా పడడం సంక్రాంతి పండక్కి రాబోయే మిగిలిన సినిమాలకు ప్లస్ అయ్యింది. అయితే అఖిల్ కి మాత్రం మైనస్ గా మారింది. విశ్వంభర వాయిదా పడడానికీ, అఖిల్కీ సంబంధం ఏమిటన్నదేగా అనుమానం. ఆ విషయంలోకి వెళ్తే..
‘విశ్వంభర’ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈమధ్య యూవీకి చెప్పుకోదగిన విజయాలు లేవు. విశ్వంభర సినిమా ఫలితం యూవీ క్రియేషన్స్ కి చాలా కీలకం. ఈ సినిమాపై దాదాపుగా రూ.150 కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు. అఖిల్ సినిమాని కూడా యూవీనే నిర్మిస్తోంది. ఆ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్లకు పైనే. ‘విశ్వంభర’ బిజినెస్ క్లోజ్ అయితే తద్వారా వచ్చే మొత్తాన్ని అఖిల్ సినిమాకు పెట్టుబడిగా పెట్టాలని యూవీ భావించింది. అయితే ‘విశ్వంభర’ డిజిటల్, శాటిలైట్ బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదు. పైగా సంక్రాంతి బరి నుంచి కూడా తప్పుకొంది. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమా పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. `ఏజెంట్` తరవాత అఖిల్ సినిమా ఏదీ మొదలు కాలేదు. యూవీ సినిమాపైనే అఖిల్ ఆశలు పెట్టుకొన్నాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతకంతకూ ఆలస్యం అవుతోంది. మరోవైపు అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉంది. యూవీ సినిమా లేట్ అయ్యింది కాబట్టి, ఈలోగా అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాకు కొబ్బరి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ లో సినిమా ఈ సంక్రాంతికి లాంఛనంగా ప్రారంభం అవుతుందని, షూటింగ్ మాత్రం ఏప్రిల్ లో మొదలవుతుందని సమాచారం. ఈలోగా.. అఖిల్ ఖాళీగా ఉంటాడా, లేదంటే… అన్నపూర్ణలో సినిమా మొదలెడతాడా అనేది చూడాలి.